‘జాతీయ విధుల నుంచి తండ్రి బాధ్యతల్లోకి’

నాలుగు నెలల పాటు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌), ఆస్ట్రేలియా సిరీస్‌ అంటూ క్రికెట్‌లో తలమునకలై ఉన్న హార్దిక్‌ పాండ్యా శనివారం కొత్త బాధ్యతల్ని స్వీకరించాడు. తన నాలుగు నెలల కొడుకు అగస్త్య బాగోగుల్ని పాండ్యా భుజానికెత్తుకున్నాడు. ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కే ఎంపికైన హార్దిక్‌ భారత్‌కు తిరిగి వచ్చేశాడు. ఇంటికి చేరుకోగానే తన బుజ్జాయి అగస్త్యకు పాలు పట్టిస్తూ సేదతీరాడు.

ఆ ఫొటోను ట్విట్టర్‌లో పంచుకున్న పాండ్యా ‘జాతీయ విధుల నుంచి తండ్రి బాధ్యతల్లోకి’ అనే వ్యాఖ్యను జతచేశాడు. ఆసీస్‌తో వన్డేలు, టి20ల్లో అదరగొట్టిన పాండ్యాకు టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ‘వన్డే, టి20 సిరీస్‌ ముగియగానే ఇంటికి వెళ్లేందుకే ప్రణాళికలు వేసుకున్నా. నేను వదిలి వచ్చినప్పుడు అగస్త్య 15 రోజుల పసికందు. ఇప్పుడు 4 నెలల చిన్నారి. అతన్ని చాలా మిస్‌ అయ్యా. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లాలా అని ఎదురు చూశా’ అని పాండ్యా పేర్కొన్నాడు.