రేపటి నుంచి తెలంగాణలో లాక్‌డౌన్‌

రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కోవిడ్‌ కట్టడి కోసం రాత్రి కర్ఫ్యూ విధించినప్పటికి మహమ్మారి అదుపులోకి రావడం లేదు. తెలంగాణ హైకోర్టుతో సహా పలు సంస్థలు లాక్‌డౌన్‌ విధించిడమే సరైన మార్గం అంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. మే 12, బుధవారం ఉదయం 10 గంటలనుంచి పదిరోజుల పాటు రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లోకి రానుంది. కేబినెట్‌ భేటీలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యవసరాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని కేబినెట్ నిర్ణయించింది.

రేపటి నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వస్తుండటంతో మందుబాబులు మద్యం షాపుల ముందు భారీగా క్యూ కట్టారు. వైన్స్‌ షాపుల ముందు ట్రాఫిక్‌జామ్‌ అయ్యింది. ఇక లాక్‌డౌన్‌ అమల్లోకి వస్తే మద్యం హోం డెలివరీకి అనుమతి ఇవ్వాల్సిందిగా లిక్కర్‌, బీర్‌ సప్లయర్స్‌ అసోసియేషన్‌ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. లిక్కర్‌ ఉత్పత్తిని కూడా ఆపకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు తగ్గిండంపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు బేఖాతరు చేస్తే కోర్టు ధిక్కారణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. అదే విధంగా.. సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఎందుకు అడ్డుకుంటున్నారని కేసీఆర్‌ సర్కారును ప్రశ్నించింది. ఇక పాతబస్తీలో కోవిడ్‌ నిబంధనలు పాటించడం లేదన్న న్యాయస్థానం.. లాక్‌డౌన్‌ విధిస్తారా లేదా నిబంధనలు కఠినతరం చేస్తారో చెప్పండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పది రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.