నేడు రామ్ పోతినేని పుట్టినరోజు

సినీ బ్యాగ్రౌండ్‌ ఉన్నప్పటికీ ఎంతో కష్టపడుతూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకునన హీరో రామ్ పోతినేని. క్లాస్‌, మాస్‌ అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తూ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు సంపాదించుకున్నాడు. యాక్టింగ్‌తో పాటు స్టయిల్‌ను, ఎనర్జీని జోడించి వెండితెరపై కిర్రాక్‌ పుట్టించే యంగ్‌ హీరోల్లో రామ్‌ఒకరు. నేడు (మే 15) రామ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

రామ్ పోతినేని మే 15, 1988న మురళీ పోతినేని, పద్మశ్రీ దంపతులకు జన్మించారు. ప్రముఖ సినీ నిర్మాత ‘స్రవంతి’రవికిశోర్ తమ్ముడే మురళీ పోతినేని. పెదనాన్న అడుగుజాడల్లో నడుస్తూ.. సినిమాలపై వైపు వచ్చాడు. 2002లో తమిళంలో తెరకెక్కిన అడయాళం అనే షార్ట్ ఫిలిమ్‌తో రామ్ తన యాక్టింగ్ కెరీర్‌ని ప్రారంభించారు.

ఆ తర్వాత వైవీఎస్‌ చౌదరీ దర్శకత్వం వహించిన దేవదాస్‌(2006) సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. తొలి సినిమాలోనే రామ్‌ అదరగొట్టాడు. తన నటన, డ్యాన్స్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా హిట్‌తో రామ్‌కి తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయితే రామ్‌ మాత్రం కథలను ఆచితూచి ఎంచుకున్నాడు. రెండో చిత్రం ‘జగడం’ప్లాపును మూట గట్టుకున్నప్పటికీ.. రామ్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఆ తర్వాత 2008లో శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘రెడీ’చేసి బాక్సాఫీస్‌ వద్ద సత్తాచాటాడు. అయితే ఆ తర్వాత రామ్‌కి పెద్దగా హిట్లు లభించలేదు. అతను నటించిన ‘మస్కా’, ‘రామరామ కృష్ణకృష్ణ’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’, ‘పండగ చేస్కో’, ‘హైపర్’, ‘హలో గురు ప్రేమ కోసమే’ తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించాయి.

ఇక 2019లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా గ్రాండ్ సక్సెస్‌ని మూటగట్టుకుంది. ఈ సినిమా తొలి రోజే రూ.10 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను, 8 కోట్లకు పైగా షేర్‌ను సాధించడం విశేషం. ఈ చిత్రం ద్వారా తన బాక్సాఫీస్ పవర్‌ను 100 కోట్ల చేర్చాడు ఈ ఇస్మార్ట్‌ హీరో. అంతే కాదు ఈ సినిమాను డబ్‌ చేసి హిందీలో వదిలితే.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపు 100 మిలియన్ల వ్యూస్‌తో అదరగొట్టింది. అంతేకాకుండా హిందీలోకి డబ్ చేసిన ఆయన నాలుగు చిత్రాలు 100 మిలియన్ల వ్యూస్‌ను నమోదు చేసుకోవడం ఓ రికార్డు. దక్షిణాది సినీ పరిశ్రమలో నాలుగు సినిమాలను 100 మిలియన్ల వ్యూస్‌కు చేర్చిన తొలి హీరోగా ఘనతను దక్కించుకొన్నారు