కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కన్నుమూత

దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. అదీకాక కోవిడ్‌ సోకిన కొంత మంది సీనియర్‌ రాజకీయ నేతలు మరణించారు. తాజాగా రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్(82) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖనాయకుడైన అజిత్‌ సింగ్‌ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఏప్రిల్ 20న కరోనా వైరస్‌ సోకింది. దీంతో ఆయన ఆరోగ్యం మరింత క్షిణించింది.

గురువారం అజిత్ సింగ్ ఆరోగ్యం పరిస్థితి పూర్తిగా విషమించటంతో మృతి చెందినట్లు ఆయన కుమారుడు, మాజీ ఎంపీ జయంత్ చౌదరి ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘ఏప్రిల్ 20న నాన్న అజిత్ సింగ్‌కు కోవిడ్ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆయన ఆనారోగ్యంతో చివరి వరకు పోరాడారు. ఈ రోజు(గురువారం) ఉదయం తుది శ్వాస విడిచారు’ అని జయంత్ చౌదరి ట్వీట్‌ చేశారు. మాజీ ప్రధాని చరణ్‌సింగ్ కుమారుడైన అజిత్‌సింగ్‌ ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయంగా కీలకమైన నేతగా ఎదిగారు.