వాణీ దేవిని గెలిపించుకోవాలి : మ‌ంత్రి హ‌రీశ్‌

హైద‌రాబాద్ : మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌-రంగారెడ్డి-హైద‌రాబాద్ జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి సుర‌భి వాణీ దేవిని గెలిపించుకోవాల‌ని రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. న‌గరంలోని ఉప్పల్ నియోజకవర్గంలో గ‌ల‌ ఓ ఫంక్షన్ హాలులో పార్టీ కార్యకర్తల సమావేశం శ‌నివారం జరిగింది. ఈ స‌మావేశానికి మంత్రి హ‌రీశ్‌రావు ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. వాణీ దేవిని అభ్య‌ర్థిగా ప్రకటించిన వెంటనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గుబులు పుట్టుకుందన్నారు. పోటీ చేస్తున్న ఏకైక మహిళా అభ్యర్థి వాణి దేవి. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతున్నారు. వారికి ఓటెందుకు వేయాల‌ని ప్ర‌శ్నించారు. ఆనాడు కరెంట్ లేక  ఇక్కడ పరిశ్రమల‌ ముందు టెంట్‌లు వేసుకొని ధర్నాలు చేసిన పరిస్థితి మనం చూశాం. కానీ ఇప్పుడు కార్మికులు ఓటీ చేసుకుంటున్నార‌న్నారు.

వాణీ దేవి మంచి విద్యావేత్త. పేరున్న కుటుంబం నుండి వచ్చింది. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి. రోజూ పెట్రోల్ రేటు పెంచుతూ పోతున్నందుకా? రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ పెడుతాం అని చెప్పి మోసం చేసినందుకు ఓటు వేయలా? 7 మండలాల‌ను ఆంధ్రలో కలిపినందుకు ఓటు వేయలా? ఏ రాష్ట్రంలో ఎన్నిక‌లు ఉంటే ఆ రాష్ట్రానికి ఎక్కువ బ‌డ్జెట్ కేటాయింపులు చేస్తున్నందుకా? తెలంగాణ‌కు బడ్జెట్‌లో మొండి చేయి చూపించినందుకా? ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు అని ప్ర‌శ్నించారు.

భారతదేశంలో ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. ఇంటింటికి నీళ్లు ఇచ్చే మిషన్ భగీరథ,కల్యాణలక్ష్మీ దేశానికి రోల్ మోడ‌ల్‌. బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు ఢిల్లీలో హై కమాండ్ ఉంటది. మనకు గల్లీలో ఉంటుంది. తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. వాణీ అక్కను గెలిపిద్దాం పీవీ నర్సింహరావుకు సముచిత గౌరవం ఇద్దాం అన్నారు. పీవీకి కనీస గౌరవం ఇవ్వని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆయనకు కనీసం సమాధి కూడా కట్టలేదు. సీఎం కేసీఆర్ పీవీ కి సముచితమైన గౌరవం ఇవ్వడం కోసం నెక్లెస్ రోడ్‌లో పీవీ ఘాట్ నిర్మించిన‌ట్లు పేర్కొన్నారు.