నేరస్తులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలకం:కమిషనర్ ప్రమోద్‌ కుమార్‌

జనగాం: ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్‌ కుమార్‌ అన్నారు. జనగాం రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను సీపీ ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ.. ప్రస్తుతం నేరస్తులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయన్నారు. వీటిద్వారా నేరాలను నియంత్రించడంతో పాటు వాటికి పాల్పడినవారిని గుర్తించడం సులభమవుతుందని చెప్పారు. కెమెరాల్లో నమోదయ్యే దృష్యాలు సాక్ష్యాలుగా నిలుస్తాయని, తద్వారా నేరస్తులకు కోర్టుల్లో శిక్షలు పడేలా చేయవచ్చని తెలిపారు. వ్యక్తిగత భద్రత కోసం తమ ఇండ్లల్లో సీసీ కెమెరాలను ఎర్పాటు చేసుకోవడం శ్రేయస్కకరమని అన్నారు.

ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం

పోలీసులు తమ విధుల్లో మరింతగా రాణించాలంటే ప్రజల సహకారం తప్పనిసరి అని, దీనికోసం త్వరలో వ్యాపారులతో కలిసి వరంగల్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జనగాం గ్రామీణ పోలీసులకు పిలుపుమేరకు ప్రజలు, దాతల సహకారంతో రఘునాథపల్లి, లింగాల ఘన్‌పూర్, గుండాల పోలీస్ స్టేషన్ల పరిధిలో కొత్తగా 82 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందులో రఘునాథపల్లిలో 50, లింగాల ఘన్‌పూర్‌లో 16, గుండాల పోలీస్ స్టేషన్‌ పరిధిలో 16 చొప్పున ఏర్పాటుచేశారు.