తక్కువ చార్జీలతో సరుకు రవాణా

రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ
సేవలు ప్రారంభమైనప్పటి నుంచి రూ.1.60 కోట్ల ఆదాయం
కొత్తగూడెం అర్బన్‌, మార్చి 22: ఆర్టీసీ కార్గో (పార్సిల్‌, కొరియర్‌) సేవలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. దీని ద్వారా సంస్థకు భారీగా ఆదాయం సమకూరుతున్నది. తక్కువ చార్జీలతో సరుకు రవాణా అవుతుండడంతో చాలా మంది కార్గో సేవల వైపు మొగ్గుచూపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.1.65 కోట్ల ఆదాయం సమకూరింది.

ఆర్టీసీలో ఏర్పాటు చేసిన కార్గో (పార్సిల్‌, కొరియర్‌) సేవలు సంస్థకు ఆదాయాన్ని తీసుకువస్తున్నాయి. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో నెంబర్‌వన్‌గా నిలిచిన సంస్థ పార్సిల్‌, కొరియర్‌ సేవలను అందించడంలోనూ ముందంజలో ఉంది. ఒకప్పుడు ప్రైవేట్‌ కొరియర్‌ సంస్థల వైపు మొగ్గుచూపిన వినియోగదారులు ఇప్పుడు ఆర్టీసీ కార్గో వైపు చూస్తున్నారు. గతేడాది జూన్‌ 19న ఉమ్మడి జిల్లాలో సేవలు ప్రారంభించగా ఇప్పటివరకు రూ.1.65 కోట్ల ఆదాయం వచ్చింది. దీనిలో ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల్లో కార్గో, పార్సిల్‌, కొరియర్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఖమ్మం డిపో నుంచి రూ.60 లక్షలు, మధిర డిపో రూ.7.90 లక్షలు, సత్తుపల్లి డిపో రూ.34 లక్షలు, కొత్తగూడెం డిపో రూ.22.30 లక్షలు, భద్రాచలం రూ.28 లక్షలు, మణుగూరు డిపో రూ.7.10 లక్షలు ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు 1,65,110 కొరియర్‌, పార్సిల్‌, పెరిసబుల్‌ వస్తువుల బట్వాడా జరిగింది. ఖమ్మం డివిజన్‌లో 1,10,840 పార్సిల్‌, కొరియర్‌, పెరిసబుల్‌ సేవల ద్వారా రూ.కోటి, భద్రాద్రి కొత్తగూడెం డివిజన్‌లో 54,300 పార్సిల్‌, కొరియర్‌, పెరిసబుల్‌ సేవల ద్వారా రూ. 60 లక్షల ఆదాయం సమకూరింది. ప్రతిరోజు సగటున ఉమ్మడి జిల్లాలో 500కు పైగా పార్సిల్స్‌ బట్వాడా అవుతున్నాయి.

చిరువ్యాపారుల నుంచి విశేష స్పందన
చిరు వ్యాపారులు, హోల్‌సేల్‌ వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, డెకరేషన్‌ చేసే యజమానులు చక్కగా కార్గో ఉపయోగించుకుంటున్నారు. హైదరాబాద్‌ నుంచి, విజయవాడ నుంచి ఉమ్మడి జిల్లా వ్యాపారులు తమకు కావాల్సిన వస్తువులను ఆర్టీసీ సర్వీస్‌ ద్వారా తెప్పించుకుంటున్నారు. ఆటోమొబైల్‌ వస్తువులు, బియ్యం, పప్పులు, కూరగాయలు, డెకరేషన్‌ వస్తువుల బట్వాడా ఎక్కువగా ఉంది. వస్తువులను ఎలాంటి డ్యామేజ్‌ లేకుండా గమ్యస్థానాలకు చేరుస్తుండడంతో దీనికి ఆదరణ బాగా పెరిగింది. తక్కువ చార్జీలు వసూలు చేస్తుండడమూ మరో కారణం.

ప్రజల నుంచి మంచి స్పందన..
ఆర్టీసీ ఏర్పాటు చేసిన కార్గో, పార్సిల్‌, కొరియర్‌ సేవలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ సేవలు అదనపు ఆదాయాన్ని ఇస్తున్నాయి. ఆర్టీసీపై ప్రజలకు ఉన్న నమ్మకం వల్లనే ఇది సాధ్యమైంది.

  • వేములవాడ కృష్ణ, భదాద్రి కొత్తగూడెం డివిజనల్‌ మేనేజర్‌