రాష్ర్టంలో మార్కెట్ల‌ను కొన‌సాగిస్తాం

హైద‌రాబాద్ : రాష్ర్టంలో మార్కెట్ల‌ను 140 నుంచి 180 వ‌ర‌కు తీసుకెళ్లాం. కేంద్రం తెచ్చిన చ‌ట్టాల ద్వారా మార్కెట్ల‌ను తీసేసిన ఈ రాష్ర్టంలో మార్కెట్ల‌ను కొన‌సాగిస్తాం అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గవ‌ర్నర్ చేసిన‌‌ ప్రసం‌గా‌నికి ధన్య‌వా‌దాలు తెలిపే తీర్మా‌నంపై చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. రైతుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చూస్తాం. మార్కెట్ల విష‌యంలో ఇప్ప‌టికే ఒక వ్య‌వ‌స్థ నిర్మాణ‌మై ఉంది. మార్కెట్ వేదిక‌గా అమ్మ‌కాలు జ‌ర‌గాలి. గ‌ద్వాల జిల్లాలోని మొత్తం వ‌రి, ఇంకో ధాన్యం రాయిచూర్‌కు వెళ్లిపోత‌ది. నిజాం సాగ‌ర్ కింద ప‌డే ధాన్యంలో 90 శాతం క‌ర్ణాట‌క‌కు తీసుకెళ్తారు. నాగార్జున సాగ‌ర్ ఆయ‌క‌ట్టు కింద పండే ధాన్యం కూడా మార్కెట్‌కు పంట‌ను తీసుకురారు. ఇలా ప‌క్క రాష్ర్టాల‌కు పోయే ధాన్యాన్ని ఇక్క‌డే సేక‌రించే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.
తేమ లేకుండా తెచ్చిన ధాన్యానికి గిట్టుబాటు ధ‌ర క‌ల్పిస్తాం. రైతుల ఖాతాల్లోకి నేరుగా డ‌బ్బులు జ‌మ చేస్తున్నామ‌ని తెలిపారు. ఎంఎస్పీ ప్ర‌కార‌మే ధాన్యాన్ని కొనుగోలు చేసి గిట్టుబాటు ధ‌ర క‌ల్పిస్తాం. తెలంగాణ‌లో పంట దిగుబ‌డి పెరిగింద‌న్నారు. ఈ నేప‌థ్యంలో గోడౌన్‌ల సంఖ్య‌ను పెంచుతున్నామ‌ని చెప్పారు. ప్రాజెక్టుల‌న్ని కంప్లీట్ కాబోతున్నాయి. ప్ర‌తి సంవ‌త్స‌రం 15 నుంచి 20 ల‌క్ష‌ల ఎక‌రాల ఆయ‌క‌ట్టు పెర‌గ‌బోతుంద‌ని అధికారులు చెప్పారు. వ‌చ్చే వానాకాలంలో పాల‌మూరు ప్రాజెక్టు స్విచ్చాన్ చేసుకునే అవ‌కాశం ఉంది. కొనుగోలు, అమ్మ‌కాలు స‌క్ర‌మంగా జ‌రిగేలా ఎమ్మెల్యేలు నిర్వ‌హ‌ణ చేయాల‌ని సూచించారు

ధ‌ర‌ణి ఒక విప్ల‌వం

ధ‌ర‌ణి ఒక విప్ల‌వం. మూడేండ్లు క‌ఠోర‌మైన శ్ర‌మ చేసి ధ‌ర‌ణిని తీసుకొచ్చం అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భూ విస్తీర్ణం.. 2 కోట్ల 77 ల‌క్ష‌ల ఎక‌రాలు.. ఇప్ప‌టికే ఒక కోటి 50 ల‌క్ష‌ల ఎక‌రాలు ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో ఎక్కాయి. ఒక కోటి 60 ల‌క్ష‌ల ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమి ఉంది. ఒక‌నాడు వీఆర్‌వో రాసింది రాత‌.. ఎమ్మార్వో గీసింది గీత అన్న చందంగా ప‌రిస్థితి ఉండేది. ఇవాళ వ్యవ‌సాయ భూముల రిజిస్ర్టేష‌న్లు 15 నిమిషాల్లో అయిపోతున్నాయి. రిజిస్ర్టేష‌న్‌, మ్యుటేష‌న్ వెనువెంట‌నే జ‌రిగిపోతున్నాయి. దీంతో భూముల రిజిస్ర్టేష‌న్ల‌లో గంద‌ర‌గోళం తొల‌గిపోయింది. ధ‌ర‌ణి రికార్డుల్లో ఎక్కిన భూమి అత్యంత భ‌ద్రంగా ఉంది. రాష్ర్టంలో మొత్తం భూమిని స‌మ‌గ్ర స‌ర్వే చేయిస్తాం. రాష్ర్టంలో 2601 రైతు వేదిక‌లు నిర్మించామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.