దేశానికే ఆదర్శంగా మన పథకాలు
  • సకల వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు
  • తెలంగాణకు జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు
  • దేశానికే ఆదర్శంగా మన పథకాలు
  • బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ అభివృద్ధి సాఫీగా కొనసాగుతున్న తరుణంలో కరోనా రూపంలో ఊహించని విపత్తు విరుచుకు పడింది. గత శతాబ్ద కాలంలో ఎన్నడూ ఎరుగనంత సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొన్నది. కేంద్రం గతేడాది మార్చి 23 నుంచి మే 5 వరకు దేశమంతటా లాక్‌డౌన్‌ ప్రకటించింది. కేంద్ర, రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావిత మయ్యాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో మన సీఎం కేసీఆర్‌ ప్రజారోగ్యం కాపాడే చర్యలు తీసుకుంటూనే, రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతినకుండా ముందు జాగ్రత చర్యలు చేపట్టడంతో తెలంగాణ కరోనా సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నది.

– రాష్ట్రప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2021-22 వార్షిక బడ్జెట్‌ అన్నివర్గాల ప్రజల ప్రశంసలు అందుకొంటున్నది. రూ.2,30,825.96 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌లో వర్గాలకు సమన్యాయం చేసేలా ఉన్నదని నిపుణులు పేర్కొంటున్నారు. గురువారం ఉదయం 11ః30 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అనుమతితో ఆర్థికమంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ ఏర్పడిన ఏడేండ్లలోనే ఏడుపదుల వయసున్న రాష్ర్టాలతో పోటీపడుతూ ప్రగతిపథంలో దూసుకుపోతున్నదని తెలిపారు.

చీకటి నుంచి వెలుగులోకి..

ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల వివక్షతో చీకట్లు కమ్ముకొన్న తెలంగాణలో స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఏడేండ్లలో సీఎం కేసీఆర్‌ వెలుగులు నింపారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఇంటా బయట ప్రభుత్వం మన్ననలు పొందుతున్నదని పేర్కొన్నారు. అస్పష్టతలను ఛేదిస్తూ, ఆదాయ వ్యయాలను ఆకళింపు చేసుకొంటూ రాష్ట్రం అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేసిందని చెప్పారు. ఈ కృషి వెనుక సీఎం కేసీఆర్‌ నిరంతర మేధోమథనం ఉన్నదని గుర్తుచేశారు. బడ్జెట్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు మంత్రి హరీశ్‌రావు మాటల్లోనే..

సర్వత్రా ప్రశంసలు

సీఎం కేసీఆర్‌ స్వయంగా ఒక రైతు. రైతుల కష్టాలు-సాధక బాధకాలన్నీ ఆయనకు అనుభవమే. తెలంగాణ వ్యవసాయ పరిస్థితులపైన ఆయన ఎంతో అధ్యయనం చేశారు. తెలంగాణ రైతు సమస్యలకు మూలాలేమిటో అవగాహన చేసుకొన్నారు. ఆ అనుభవంతోనే రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగారు. ఈ వ్యవసాయ పథకాలను ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించటం మనకు గర్వకారణం. మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయి. అనేకమంది ప్రముఖులు, వ్యవసాయరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు.

ప్రాజెక్టుల జీవధార

తెలంగాణ స్పృహలేని గత పాలకులు అంతర్‌ రాష్ట్ర వివాదాలకు ఏర్పడేలా సాగునీటి ప్రాజెక్టులు రూపొందించారు. రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యాన్ని తగ్గించారు. వాటిని సరిదిద్దేందుకే సీఎం కేసీర్‌ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ చేపట్టారు. వివాదాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించి శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించారు. గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు పూర్తయింది. సీతారామ ప్రాజెక్టు పూర్తి కావొస్తున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు వేగంగా జరుగుతున్నాయి. ‘చూడు చూడు నల్లగొండ. గుండెమీద ఫ్లోరైడు బండ. బొక్కలొంకరపోయిన బతుకుల మన నల్లగొండ. దుక్క మెల్లాదీసేదెన్నాళ్లు’ అని నల్లగొండ తాగునీటి కష్టాలను చూసి చలించి ఆనాడు పాట రాసిన ముఖ్యమంత్రే ఈనాడు ఫ్లోరైడ్‌ పీడను శాశ్వతంగా తొలగించారు. నల్లగొండలో ఫ్లోరైడ్‌ పీడ అంతమయిందని కేంద్రప్రభుత్వం పార్లమెంటు వేదికగా ప్రకటించింది.

లక్ష కోట్ల పంట పండించారు

రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక పథకాలతో తెలంగాణలో వ్యవసాయం పండుగైందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ ఏడాది తెలంగాణ రైతులు రికార్డుస్థాయిలో రూ.లక్ష కోట్ల పంట పండించారని తెలిపారు. 2014-15లో 1.41 కోట్ల ఎకరాల సాగుభూములుండగా ఇప్పుడు ఏకంగా అది 2.10 కోట్ల ఎకరాలకు పెరిగింది. 49 శాతం వృద్ధి నమోదు చేసుకొన్నది. పంటల ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. 2014-15లో 2.5 కోట్ల టన్నుల పంటలు ఉత్పత్తికాగా, 2020-21లో అది 4.11 కోట్ల టన్నులకు పెరుగుతుందని అంచనా వేశాం. వరి,పత్తి సాగులో తెలంగాణ మేటిగా నిలుస్తున్నది. 60.54 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేసి దేశంలోనే అత్యధికంగా పత్తి సాగుచేసిన రెండో రాష్ట్రంగా నిలిచింది. 2019-20లో 193 లక్షల టన్నుల ధాన్యం పండించగా, ఇందులో 111 లక్షల టన్నుల ధాన్యం ఎఫ్‌సీఐకి ఇచ్చాం. వరి ధాన్యం సేకరణలో దేశంలోనే రెండోస్థానంలో నిలిచాం. ఈ యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో వరి సాగుచేసి దేశంలోనే నెం.1 రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

భూ వివాదాలకు పరిష్కారం

ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర భూమి హక్కులు- పట్టదారు పాస్‌పుస్తకాల చట్టం- 2020ని అమల్లోకి తెచ్చి భూ వివాదాలకు పరిష్కారం చూపింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను ఒక ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా ఖర్చుచేయకుంటే వాటిని తదుపరి ఆర్థిక సంవత్సరానికి బదలాయించేలా చట్టంలో నిబంధన పెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇటీవలే రాజస్థాన్‌ ప్రభుత్వం మన విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. బీసీ వర్గాలను విద్యాపరంగా అభివృద్ధి చేసేందుకు చర్యలను తీసుకుంటున్నది. కుల వృత్తులకు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నది. బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశాకు వెళ్లిన తెలంగాణ కార్మికుల కోసం కేరళ తరహాలో వ్యవస్థను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మానవీయతకు మారుపేరై సీఎం కేసీఆర్‌, ఉద్యోగాలు చేసే గర్భిణులు సెలవుల్లో కోల్పోయే వేతనాన్ని చెల్లించాలని నిర్ణయించారు. మా ధ్యేయం సకల జనుల సంక్షేమం. మా లక్ష్యం ప్రజల బతుకులు పండించే బంగారు తెలంగాణం. ప్రజలే చరిత్ర నిర్మాతలన్న విశ్వాసంతో ముందుకు సాగుదాం. జై హింద్‌.. జై తెలంగాణ.

కరోనా సంక్షోభాన్ని ఎదిరించి నిలిచాం..

రాష్ట్ర అభివృద్ధి సాఫీగా సాగుతున్న తరుణంలో కరోనా రూపంలోఊహించని విపత్తు విరుచుకుపడింది. శతాబ్దకాలంలో ఎన్నడూ ఎరుగనంత సంక్షోభాన్ని యావత్‌ ప్రపంచం ఎదుర్కొన్నది. గొప్పగొప్ప దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. ఆకాశంలో ఎగిరే విమానం మొదలుకొని రోడ్డు మీద పరిగెత్తే ఆటోరిక్షా వరకు అన్నీ ఆగిపోయాయి. ఈ పర్యవసానాలన్నింటికీ తెలంగాణ కూడా లోనయింది. లాక్‌డౌన్‌ కేంద్ర, రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపింది. దేశ జీడీపీ దారుణంగా పతనమయ్యింది. స్థిర ధరల్లో మొదటి త్రైమాసికంలో -24.4 శాతం, రెండో త్రైమాసికంలో -7.3 శాతం, 3వ త్రైమాసికంలో +0.4 శాతంగా నమోదయ్యింది. మొత్తంగా ఏడాదిలో -8.0 శాతం జీడీపీ పతనమైంది. ప్రస్తుత ధరల్లో దేశ జీడీపీ వృద్ధి -3.8 శాతం ఉండగా, తెలంగాణ ఎంతో మెరుగ్గా +1.3 శాతం వృద్ధి నమోదుచేసింది. ప్రతికూల పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ ఒకపక్క ప్రజల ఆరోగ్యం కాపాడే చర్యలు తీసుకొంటూనే, మరోవైపు రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతినకుండా జాగ్రత చర్యలు చేపట్టారు. దీంతో తెలంగాణ ఆరోగ్య రంగంలోనూ ఆర్థికరంగంలోనూ కరోనా కాలం విసిరిన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నది. ఆర్థిక వ్యవస్థ క్రమేపీ కోలుకొంటున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం రాష్ట్ర జీఎస్‌డీపీలో మంచి వృద్ధి ఉంటుందని ఆశిస్తున్నాం. అందుకు అనుగుణంగానే ఈ బడ్జెట్‌ను రూపొందించాం.

మెరిసిన మాటలు.. విరిసిన కవితలు

ఆద్యంతం ఆసక్తికరంగా మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రసంగం
ప్రముఖుల స్ఫూర్తిదాయక సందేశాలు.. మహాకవుల అద్భుత కవితలు..ఆద్యంతం ఆసక్తికరం.. ఆర్థికమంత్రి హరీశ్‌రావు గురువారం అసెంబ్లీలో చేసిన బడ్జెట్‌ ప్రసంగం తీరిది. సందర్భోచిత సందేశాలు, పద్యాలతో గంటన్నరపాటు సాగిన ప్రసంగం అందరి ప్రశంసలు అందుకొన్నది. రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్లలోనే ఏడు పదుల వయసున్న రాష్ర్టాలతో పోటీపడుతున్నదని చెప్తూ మహాకవి దాశరథి రచించిన ‘ఏదీ సులభమ్ముగా రాదు లెమ్ము’ అనే కవితను గుర్తుచేశారు. ఎస్సీల సర్వతోముఖాభివృద్ధికోసం బడ్జెట్‌లో కొత్తగా సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ పథకాన్ని ప్రకటిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సందేశాన్ని గుర్తుచేశారు. ‘ధ్యేయం పట్ల నిలువెల్లా అంకితభావం కలిగిన వ్యక్తులే సమాజాన్ని ముందుకు నడిపిస్తారు. ఈ మాటను నిజం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ షెడ్యూల్‌ కులాల ప్రజల సమగ్రాభివృద్ధికి నూతన పథకాన్ని రూపొందించారు’అని వెల్లడించారు. రాష్ట్రంలోని సకల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ ‘ధ్యేయమును బట్టి ప్రతి పని దివ్యమగును’ అన్న దాశరథి మాటలను ఉటంకించారు. విద్యారంగానికి భారీగా నిధులు కేటాయించటంపై మాట్లాడుతూ ‘వ్యక్తికి స్వావలంబన చేకూర్చేదే నిజమైన విద్య’ అన్న స్వామీ వివేకానంద సందేశాన్ని గుర్తుచేశారు. ‘విద్య లేకపోవటం వల్లనే వెనకబడిన తరగతులు అణచివేతకు గురవుతాయి’ (ల్యాక్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ లెడ్‌ అప్రేషన్‌ ఆఫ్‌ లోయర్‌ క్యాస్ట్‌)’ అన్న మహాత్మా జ్యోతిబాపూలే వ్యాఖ్యలను ప్రస్తావించారు. బడ్జెట్‌ అంటే చిట్టా పద్దుల ఆవర్జా కాదని, అది జీవమున్న బతుకుసారమని వ్యాఖ్యానించారు. చివరగా హైహింద్‌.. జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ముగించారు.

విద్యారంగానికి శుభసూచకం

బడ్జెట్‌ చాలా బాగుంది. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ప్రతిపాదనలు చేశా రు. ప్రాథమిక విద్యకు రూ. 11,735 కోట్లు, ఉన్నత విద్యకు రూ.1,873 కోట్లు కేటాయించారు. రూ.4 వేల కోట్లతో సరి కొత్త విద్యా పథకాన్ని ప్రతిపాదించారు. విద్యారంగానికి ఇది శుభ సూచకం.

– డాక్టర్‌ కోడూరి శ్రీవాణి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌,

శాతవాహన యూనివర్సిటీ, కరీంనగర్‌

నేత కార్మికులకు చేయూత

చేనేత రంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా పెద్దమొత్తంలో బడ్జెట్‌ కేటాయింపు చేపట్టడం అభినందనీయం. ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా చేనేత రంగం అభివృద్ధికి రూ.338 కోట్లు కేటాయించారు. నిధుల కేటాయింపు ద్వారా కుంటుబడుతున్న చేనేత రంగానికి, నేత కార్మికులకు సర్కారు చేయూతనిచ్చింది. సీఎం కేసీఆర్‌ వల్లే ఇది సాధ్యమైంది.

– శ్రీమన్నారాయణ, చేనేత కార్మికుడు, గద్వాల

దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట

రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేసింది. బడ్జెట్‌లో దేవాదాయశాఖ డీడీఎన్‌ఎస్‌కు రూ.720 కోట్లు కేటాయించారు. ఆధ్యాత్మిక చింతన కలిగిన సీఎం కేసీఆర్‌ అర్చకులను ఆదుకోవడమే కాకుండా ఆలయాల అభివృద్ధిపై దృష్టి సారించారు. తిరుపతి తరహాలో యాదాద్రిని తీర్చిదిద్దడం సాధారణమైన విషయం కాదు. యాదాద్రి కట్టడాలు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గవి.

– డిండిగల్‌ ఆనంద్‌శర్మ, అర్చక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,

అలంపూర్‌, జోగలాంబ గద్వాల జిల్లా

ఎంబీసీలకు వెయ్యి కోట్లు హర్షణీయం

బడ్జెట్‌లో ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు కేటాయించడం హర్షణీయం. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేండ్లలో ఏ ప్రభుత్వం ఎంబీసీలను గుర్తించిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 36 కులాలను ఎంబీసీలుగా గుర్తిస్తూ ఆత్మగౌరవాన్ని పెంచారు. తాజాగా మరో 13 కులాలను గుర్తించి బీసీఏ గ్రూపులో చేర్చేందుకు కృషిచేశారు. -ఎంఎస్‌ నరహరి, తెలంగాణ సంచార జాతుల ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

దళిత సాధికారత సంతోషం

వెయ్యి కోట్లతో సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ పథకం ప్రవేశపెట్టడం హర్షణీయం. ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.21,306 కోట్లు కేటాయించడం సంతోషదాయకం. గత సంవత్సరం మిగిలిన నిధులను ఈసారి ఖర్చు చేస్తామని తెలిపారు. దళితుల భూ పంపిణీకి మరిన్ని నిధులు పెంచాలి.

– చిట్టెం విజయకుమారి, దళిత్‌ వుమెన్‌ నెట్‌వర్క్‌

జిల్లా, మండల పరిషత్‌లకు నిధులు చరిత్రాత్మకం

రాష్ట్ర చరిత్రలోనే ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగినది. బడ్జెట్‌ సమావేశాల్లో జిల్లా, మండల పరిషత్‌లకు రూ.500 కోట్లు ప్రకటించడం చరిత్రాత్మకం. దశాబ్దాల కాలంపాటు నిధులు, విధుల కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించడం అభినందనీయం.

– కుమార్‌గౌడ్‌, తెలంగాణ ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు

విద్యారంగానికి పెద్దపీట

బడ్జెట్‌లో విద్యారంగానికి పెద్దపీట వేశారు. విద్యారంగానికి, విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ రూ.15,608 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. పాఠశాల, ఉన్నత విద్య, గురుకుల పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ మొత్తం ఎంతో ఉపయోగపడుతుంది. పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించడానికి దోహదపడుతుంది.

-గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, కిశోర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్వీ నాయకులు

నిమ్స్‌కు 98శాతం ఎక్కువ నిధులు

బడ్జెట్‌లో నిమ్స్‌ దవాఖానకు రూ.219 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే 98శాతం అధికంగా నిధులు ఇచ్చారు. నిమ్స్‌ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తం నిధులు కేటాయించడం తొలిసారి. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు నిమ్స్‌ దవాఖాన సిబ్బంది తరఫున ధన్యవాదాలు.

-మార్త రమేశ్‌, నిమ్స్‌ అనుసంధానాధికారి

నీరా పాలసీకి 25కోట్లు

గీత కార్మికుల సంక్షేమానికి తెచ్చిన నీరా పాలసీకి రూ.25 కోట్లు, ఆబ్కారీశాఖకు రూ.44 కోట్లను కేటాయించారు. నీరా పాలసీతో ఆరోగ్యకరమైన పానీయం అందుబాటులోకి వస్తుంది. వేల మంది గౌడ కార్మికులకు ఉపాధి కలుగుతుంది. ప్ర మాదవశాత్తు చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కింద రూ.5 కోట్లు కేటాయించారు.

వరంగల్‌, ఖమ్మంకు 400కోట్లు

హైదరాబాద్‌ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్‌ అభివృద్ధికి రూ.250 కోట్లు కేటాయించారు. ఖమ్మంకు రూ.150 కోట్లు ప్రతిపాదించారు. ఇప్పటికే ఈ రెండు నగరాల్లో పెద్దఎత్తున అభివృద్ధి జరుగుతున్నది. మరింత సుందరమైన నగరాలుగా తీర్చిదిద్దడానికి నిధులు ఖర్చు చేయనున్నారు.

ఎస్సీ ప్రత్యేక ప్రగతి నిధి 21,306.85 కోట్లు
ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి 12,304.23 కోట్లు
బీసీ సంక్షేమం 5,522కోట్లు