సర్వ హంగులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న తెలంగాణ నూతన సచివాలయం

నూతన సచివాలయం సర్వ హంగులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నది. ఈ ఏడాది చివరి నాటికి నిర్మాణం పూర్తిచేసి నూతన సచివాలయ భవనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దాదాపు 50 మంది ఇంజినీర్లు, 10 మంది ఆర్కిటెక్టులు, రెండువేల మంది కార్మికులు మూడు షిఫ్టులలో 24 గంటలూ పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, అధికారులు వివిధ ప్రాంతాలకు నేరుగా సచివాలయం నుంచే హెలికాప్టర్‌లో వెళ్లడానికి వీలుగా ఈశాన్యం వైపున హెలిప్యాడ్‌ను నిర్మిస్తున్నారు. ఈ ఏడంతస్తుల మేడను దక్కనీ నిర్మాణ శైలి, సంస్కృతిలో ఉంటుంది. ఈ భవనం అనేక ప్రత్యేకతలతో నిర్మాణమవుతున్నది.

  • ఈ భవనానికి ప్రధాన ద్వారం వద్ద ఉపరితలం నుంచి డోమ్‌ వరకు 11 అంతస్తులు ఉంటుంది. దీనిపైన రెండు అంతస్తుల  స్కైలాండ్‌, ఆపై మరో రెండు అంతస్తుల డోమ్‌ ఫ్లోర్‌ నిర్మించనున్నారు. దీనిపై ఒక్క అంతస్తు ఎత్తులో ఆశోకచక్రం వస్తుంది. ఇక్కడ మొత్తం ఎత్తు 278 అడుగులు ఉంటుందని అంచనా. మొత్తం సచివాలయానికి 18 డోమ్‌లు వస్తాయి.
  • మధ్యలో విశాలమైన పచ్చికబయలు దాని చుట్టూ భవనం నిర్మాణం అవుతుంది.  లాన్‌ మధ్యలో వాటర్‌ ఫౌంటెయిన్‌  ఏర్పాటు చేస్తారు.
  • భవన సముదాయం ఏడంతస్తులు నిర్మించనున్నారు. ఈ మొత్తం ఎత్తు 119 అడుగులు కాగా, ఒక్కో అంతస్తు 14 ఫీట్లు ఉండేలా డిజైన్‌చేశారు.
  • సచివాలయ ప్రధాన భవనం ఏడు లక్షల చదరపు అడుగులు. ఏడంతస్తులు, లాబీ కలిపి 6 లక్షల చదరపు అడుగులు. స్కైలాంజ్‌ 52 వేల చదరపుటడుగులు, ఎమినిటీస్‌ అండ్‌ యుటిలిటీస్‌ 48 వేల చదరపుటడుగులు. ఒక్కో అంతస్తు 85,536 చదరపు అడుగుల చొప్పున ఉంటాయి. ఇందులో కార్పెట్‌ ఏరియా 44,764 చదరపు అడుగుల, కారిడార్స్‌17,444, లిఫ్ట్‌ లాబీస్‌ 15,230 ఎస్‌ఎఫ్‌టీ, మరుగుదొడ్లు, వంటగది, తదితరాలు కలిపి 8098 చదరపుటడుగులు.
  • ఒక్కో అంతస్తులో మూడు మంత్రిత్వ శాఖలుఒక్కో అంతస్తులో మూడు మంత్రిత్వ శాఖలు ఉంటాయి. ఒక్కో మంత్రిత్వశాఖకు 8,640 చదరపుటడుగులు స్థలాన్ని కేటాయిస్తున్నారు. ఇందులోనే ప్రతి మంత్రిత్వశాఖకు ఒక మీటింగ్‌ హాల్‌ ఉంటుంది. ప్రతి అంతస్తులో ఉద్యోగులు లంచ్‌ చేయడానికి ఒక డైనింగ్‌ రూమ్‌ నిర్మిస్తున్నారు. ఒక మంత్రిత్వ శాఖకు సంబంధించిన సెక్షన్లన్నీ ఒకే దగ్గర ఉంటాయి. మంత్రి, కార్యదర్శి, అడిషనల్‌ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, సెక్షన్‌ అధికారులు, కార్యాలయ సిబ్బంది అంతా ఒకేచోట ఉండేలా నిర్మిస్తున్నారు. విశాలమైన పార్కింగ్‌సచివాలయానికి నాలుగు వైపులా  పెద్దఎత్తున పార్కింగ్‌ సౌకర్యం ఏర్పాటుచేస్తున్నారు. ప్రధాన భవనానికి ఉత్తరం, దక్షిణం వైపులలో  పార్కింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయ ప్రధాన భవనం చుట్టూ ఉన్న 50 ఫీట్లు, 65 ఫీట్ల రోడ్డుకు ఆనుకొని ఉన్న స్థలంలో సచివాలయానికి వచ్చే సందర్శకుల పార్కింగ్‌తోపాటు ఇతర అన్ని రకాల వసతులను కల్పిస్తున్నారు.

అందమైన లాన్‌లు విశాలమైన రోడ్లు

సచివాలయం ఒక పర్యాటక ప్రదేశాన్ని తలపించనుంది. సచివాలయం ముందు భాగంలో అతిపెద్ద పచ్చికబయళ్లు ఏర్పాటు చేస్తున్నారు.  వాటి మధ్యలో రెండు ఫౌంటెన్లు నిర్మించనున్నారు. ఈ లాన్‌ మధ్యలో 60 ఫీట్ల వెడల్పుతో వీవీఐపీలు సచివాలయానికి వచ్చే ప్రధాన రహదారి నిర్మించనున్నారు. ఈ లాన్‌లను ఆనుకొని ఉత్తర, దక్షిణం వైపు 24 ఫీట్ల వెడల్పుతో రోడ్లు నిర్మిస్తున్నారు.  ఉత్తరం వైపు రోడ్డు నుంచి కార్యదర్శులకు, దక్షిణం వైపు రోడ్డు నుంచి సందర్శకులకు ప్రవేశం కల్పిస్తారు. సచివాలయం ముందు 67 ఫీట్ల రోడ్డు ఉంది. ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ముఖ్యమంత్రి వచ్చేందుకు ప్రత్యేక మార్గం ఉంటుంది. సచివాలయం వెనుక వైపు భాగంలో ప్రధాన భవనానికి ఆనుకొని 24 ఫీట్ల రోడ్డు ఉంటుంది. దీనికి ఆనుకొని పార్కింగ్‌ ఇచ్చారు.