ఫలితం తేలేది ఇలా!
 • వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు భారీ పోలింగ్‌తో ప్రశాంతంగా ముగియగా ప్రస్తుతం అందరి దృష్టి కౌంటింగ్‌పైనే కేంద్రీకృతమైంది.
 • మూడు ఉమ్మడి జిల్లాల ఓటర్లు ఇచ్చిన తీర్పు బ్యాలెట్‌ బాక్సుల్లో భద్రంగా నల్లగొండ పట్టణం ఆర్జాలబావి పరిధిలోని స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ గోదాముల్లోని స్ట్రాంగ్‌ రూములకు చేరింది.
 • బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలు కానుండగా నిరాటంకంగా 48గంటలపాటు కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణ ఎన్నికల మాదిరిగా కాకుండా ఈ ఎన్నికల్లో కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తి భిన్నంగా కొనసాగనుంది.
 • ఓటింగ్‌లో ప్రాధాన్యత ప్రకారం ఓటర్లు ఓటు వేయగా కౌంటింగ్‌ కూడా అదే విధంగా జరుగనుంది.
 • తొలి ప్రాధాన్యత ఓట్లను మొదలు లెక్కించి ఆ సమయంలోనే చెల్లని ఓట్లను పక్కకు వేస్తారు.
 • చెల్లిన ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ విజేతకు అవసరమైన కోటాను నిర్ణయిస్తారు. చెల్లిన ఓట్లల్లో యాభై శాతం ప్లస్‌ ఒకటి కలిపి విజేతకు అవసరమైన గెలుపు కోటాను నిర్ధారిస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్లలోనే ఈ గెలుపు కోటాను అభ్యర్థులు సాధిస్తే సరేసరి.
 • లేకుంటే ఎలిమినేషన్‌ పద్ధతిలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు.
 • వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఫలితాల కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు.
 • నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదాములలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచారు.
 • అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో వీటికి సీల్‌ వేసి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఇదే ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు మొదలుకానుంది.
 • ఈసారి ఓటర్ల సంఖ్య భారీగా ఉండడంతో పోలింగ్‌ కూడా పెరుగుతుందని అంచనా వేసిన అధికారులు ముందుస్తుగానే కౌంటింగ్‌ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించారు.
 • మొత్తం ఎనిమిది రూమ్స్‌ను కౌంటింగ్‌ కోసం సిద్ధం చేశారు.
 • ఒక్కో రూమ్‌లో ఏడు టేబుళ్లను ఏర్పాటు చేశారు. వీటికి అనుగుణంగా 3500మంది సిబ్బందిని ఎంపిక చేసి నాలుగు షిఫ్టులుగా వీరికి విధులు కేటాయించారు.
 • వీరికి రెండుసార్లు శిక్షణ ఇచ్చి మాక్‌ కౌంటింగ్‌ కూడా చేపట్టారు. కౌంటింగ్‌ సజావుగా సాగేలా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు.
 • బండిల్‌ ప్రక్రియకు 12గంటల సమయం
  ఓట్ల లెక్కింపు సరిగ్గా బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది.
 • 8 గదుల్లో గదికి ఏడు టేబుళ్ల చొప్పున 56 కౌంటింగ్‌ టేబుళ్లను ఏర్పాటు చేశారు.
 • ముందుగా వీటిపై బ్యాలెట్‌ పత్రాలను కట్టలు కట్టే కార్యక్రమం చేపడుతారు.
 • మొత్తం 731 పోలింగ్‌ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్‌ బాక్స్‌లను వరుస క్రమంలో టేబుల్‌కు ఒకటి ఇచ్చి ఓపెన్‌ చేస్తారు. బ్యాలెట్‌ బాక్స్‌ల్లోని బ్యాలెట్‌ పేపర్లను టేబుల్‌పై కుప్పగా పోసి 25పేపర్లను ఒక కట్టగా చేసి బండిల్స్‌ చేస్తారు. ఇలా మొత్తం బ్యాలెట్‌ బాక్స్‌లు ఓపెన్‌ చేసి కట్టలు కడుతారు.
 • పోస్టల్‌ బ్యాలెట్లను కూడా ఇదే సమయంలో వీటితో కలిపేస్తారు. ఎప్పటికప్పుడు వీటిన్నింటినీ తీసుకెళ్లి ఓ పెద్ద డ్రమ్ములో వేస్తారు.
 • బండిల్‌ కార్యక్రమం మొత్తం పూర్తయ్యాక అసలు లెక్కింపు మొదలుకానుంది. అయితే ఇలా బండిల్‌ కార్యక్రమానికే కనీసం 12గంటల సమయం పట్టొచ్చని అధికారుల అంచనా. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇది కొనసాగుతుండవచ్చని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ‘నమస్తే తెలంగాణ’తో వెల్లడించారు. ఆ తర్వాతే అసలు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. తొలి ప్రాధాన్యత ఓట్లను ముందుగా లెక్కిస్తారు.
 • తొలి రౌండ్‌ ఫలితం రాత్రి పది గంటలకు…
  అనుకున్న విధంగా రాత్రి ఎనిమిది గంటల వరకు బండిలింగ్‌ ప్రక్రియ ముగిస్తే…
 • తర్వాత తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడుతారు. అయితే ఒక్కో టేబుల్‌కు 40 బండిల్స్‌ చొప్పున ఇస్తూ వెయ్యి ఓట్లను లెక్కిస్తారు. ఇలా మొత్తం 56 టేబుళ్లపై ఒక్కో రౌండ్‌లో 56వేల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.
 • ఇలా చేపట్టే తొలి రౌండ్‌ ఫలితం 17వ తేదీ రాత్రి పది గంటలకు రావచ్చని అంచనా.
 • మొత్తం ఏడు రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఫలితాలు పూర్తిగా వెల్లడికానున్నాయి.
 • ఒక్కో రౌండ్‌కు గంట నుంచి గంటన్నర సమయం చొప్పున మొత్తం తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 18వ తేదీ ఉదయం ఆరుగంటల వరకు పూర్తి కావచ్చని భావిస్తున్నారు.
 • ఈ ఎన్నికల్లో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో మొత్తం 3,86,320 ఓట్లు పోలైన విషయం తెలిసిందే.
 • తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సమయంలోనే చెల్లని ఓట్లను కూడా వేరుచేస్తారు. చెల్లని ఓట్లను పక్కన వేసి చెల్లిన ఓట్ల నుంచే గెలుపు కోటాను నిర్ధారిస్తారు.
 • మొత్తం చెల్లిన ఓట్లలో 50శాతం+1ను గెలుపు కోటాగా నిర్ధారిస్తారు. ఉదాహరణకు మొత్తం ఓట్లలో 3లక్షల ఓట్లు చెల్లుబాటైతే అందులో సగం అంటే 1,50,000+1= 1,50,001 ఓట్లు వచ్చిన అభ్యర్థి విజేత అవుతారు.
 • తొలి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికీ గెలుపు కోటా రాకపోతే అప్పుడు ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలవుతుంది.
 • తొలి ప్రాధాన్యత ఓట్లతో విజేత తేలకుంటే.
  ఎలిమినేషన్‌ ప్రక్రియ విభిన్నంగా కొనసాగనుంది.
 • ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించే సమయంలో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరికైతే తక్కువ తొలి ప్రాధాన్యత ఓట్లు వస్తాయో.. వారి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ముందుగా లెక్కించి ఆ అభ్యర్థిని ఎలిమినేట్‌ చేస్తారు.
 • తొలి ఓట్లలో చివరి స్థానంలో నిలిచిన అభ్యర్థికి పోలైన ద్వితీయ ఓట్లు.. ఏ అభ్యర్థులు పొందినవి వారికి కేటాయిస్తారు.
 • ఇంకా కూడా కోటా రాకపోతే చివరి తక్కువ తొలి ప్రాధాన్యత వచ్చిన రెండో అభ్యర్థికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను పరిగణలోకి తీసుకుని మిగతా వారికి పంచేస్తారు.
 • ఆయా అభ్యర్థుల తొలి ప్రాధాన్యత ఓట్లకు ఎలిమినేషన్‌ ప్రక్రియలో వస్తున్న ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను కలుపుకుంటూ ముందుకెళ్తారు.
 • మొత్తం 71మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో గెలుపు కోటా వచ్చేవరకు కింది నుంచి పైకి అందరి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తూ వెళ్తారు.
 • ఈ క్రమంలో ఎక్కడైనా ఏ అభ్యర్థికైనా గెలుపు కోటా ఓట్లు వస్తే అక్కడితో కౌంటింగ్‌ను నిలిపివేసి విజేతగా ప్రకటిస్తారు.
 • రెండో ఓట్లతో తేలకుంటే మూడో ప్రాధాన్యతకు..
  ఎలిమినేషన్‌ పద్ధతిలో చివరి నుంచి ఇద్దరు మిగిలే వరకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించి.. తొలి ప్రాధాన్యత ఓట్లకు కలిపిన తర్వాత కూడా విజేత తేలని పక్షంలో మూడో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు.
 • మళ్లీ ద్వితీయ ఓట్లు లెక్కించిన తరహాలోనే ఈ ప్రక్రియ సాగుతుంది. తక్కువ తొలి ప్రాధాన్యత ఓట్లు పొందిన చివరి అభ్యర్థి నుంచి మొదలు పెట్టి మళ్లీ ఇద్దరు మిగిలే వరకు విజేతను తేల్చేలా చూస్తారు.
 • ఆయా అభ్యర్థులకు వచ్చిన తృతీయ ప్రాధాన్యత ఓట్లను.. ముందుగా జత చేసిన తొలి, ద్వితీయ ఓట్ల మొత్తానికి కలుపుతారు. ఈ క్రమంలో ఎక్కడ ఏ అభ్యర్థికైతే యాభై శాతం కంటే ఒక్క ఓటు అదనంగా వచ్చినా వారు విజేతగా నిలుస్తారు.
 • కాకపోతే ఇప్పటివరకు తొలి ప్రాధాన్యతలో తేలకపోతే ద్వితీయ ప్రాధాన్యతతో గెలుపు సాధించిన సంఘటనలే ఉన్నాయి.
 • తృతీయ ప్రాధాన్యత వరకు లెక్కింపు వెళ్లిన దాఖలాలు లేవని తెలుస్తోంది.
 • కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
  ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తెలిపారు.
 • కట్టుదిట్టమైన భద్రత నడుమ బ్యాలెట్‌ బాక్స్‌లను స్ట్రాంగ్‌ రూమ్స్‌లో భద్రపరిచాం. కౌంటింగ్‌ కోసం ఇప్పటికే సిబ్బంది నియామకం, శిక్షణ, లెక్కింపునకు అవసరమైన సామగ్రి అంతా సిద్ధం చేశాం.
 • లెక్కింపు ప్రారంభంలో బ్యాలెట్‌ బాక్స్‌లను ఓపెన్‌ చేసి 25చొప్పున కట్టలు కడుతారు. ఇలా కట్టలు కట్టే కార్యక్రమం రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగవచ్చని భావిస్తున్నాం. తర్వాత తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాత్రి పది గంటల వరకు తొలి రౌండ్‌ ఫలితం రావచ్చని అంచనా వేస్తున్నాం.
 • 18వ తేదీ తెల్లవారే సరికి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తికావచ్చు.
 • తర్వాత కోటా నిర్ధారించి గెలుపు కోటా వచ్చేవరకు ఎలిమినేషన్‌ ప్రక్రియలో కౌంటింగ్‌ కొనసాగిస్తాం. మొత్తం కౌంటింగ్‌ ప్రక్రియకు 48గంటల సమయం పట్టవచ్చు.
 • అందుకు అనుగుణంగానే నాలుగు షిఫ్టులుగా సిబ్బందిని విభజించి విధులు కేటాయించాం. కౌంటింగ్‌ను పూర్తి పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా జరగాలని కోరుకుందాం….

(సేకరించిన సమాచారం)

అవగాహన కోసం