బండి సంజయ్ పై మండిపడ్ద మంత్రి సత్యవతి రాథోడ్

ములుగు : దేవతల దగ్గరికి వచ్చి ఏమి కోరుకోవాలో కూడా కనీసం తెలియని మూర్ఖుడు బీజేపీ నేత బండి సంజయ్ అని రాష్ట్ర గిరిజ‌న సంక్షేమ‌శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ అన్నారు.  ములుగు జిల్లాకు వచ్చి గట్టమ్మ దేవతను మొక్కి సీఎం కేసీఆర్ నాశనం కావాలని కోరుకున్న‌ట్లు చెప్పడం కంటే బుద్ధిహీనత మరొకటి లేదన్నారు. ఏవ‌రైనా దేవ‌త‌ల కాడికి వ‌చ్చి అంద‌రిని స‌ల్లంగా చూడు త‌ల్లి అని మొక్కుకుంటారు. కానీ ఇలా మొక్కుకోవ‌డం అంటే అది బండి సంజ‌య్ వికృత స్వ‌భావానికి నిద‌ర్శ‌న‌మ‌ని ఆమె దుయ్య‌బ‌ట్టారు. వరంగల్- ఖమ్మం- నల్ల‌గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరుతూ శ‌నివారం ములుగులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ పైనా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరును మంత్రి తూర్పారాబ‌ట్టారు.

ములుగు జిల్లా ఏర్పాటే స‌మాధానం..

మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ వచ్చి ఓట్లు అడుగుతారు. పట్టభద్రులు అంటే విద్యావంతులు, ఎవరి వల్ల ఈ ప్రాంతానికి, ప్రజలకు మేలు జరిగిందో తెలిసిన వాళ్ళు. తెలంగాణ ప్రజలు గ్లాస్ నీళ్ళు ఇస్తేనే మర‌చిపోని వారు. అట్లాంటిది మనకు రాష్ట్రాన్ని తెచ్చి, జిల్లా ఇచ్చిన నాయకుడిని, పార్టీని ఎట్లా మ‌ర్చిపోతామ‌న్నారు. కేసీఆర్ కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించి, సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నార‌న్నారు. తెలంగాణ వస్తే ఏమి వస్తుంది అని అడిగిన వాళ్లకు ములుగు జిల్లా రావడమే సమాధానమ‌న్నారు.

తెలంగాణ హ‌క్కుల‌ను కాల‌రాసే బీజేపీకి బుద్ది చెప్పాలి..

బండి సంజయ్ గట్టమ్మను మొక్కి సీఎం కేసీఆర్‌ను ఓడించమని కోరడం ఆయన వికృత స్వభావానికి నిదర్శనం అన్నారు. ఎవరైనా త‌న‌ను చల్లగా చూడమని, ప్రజలందరినీ చల్లగా చూడమని కోరుతారు. కానీ బండి సంజయ్ ఒక మూర్ఖుడు. తెలంగాణ పోరాటంలో లేనివాడు. ఈ రాష్ట్రం ఎందుకు సాధించుకున్నామో కూడా తెలియ‌ని వాడు బండి సంజయ్ అని దుయ్య‌బ‌ట్టారు. దేవతలను ఏమి మొక్కాలో తెలువని బుద్ది హీనుడు. తెలంగాణ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో తెలువని మూర్ఖుడు. అందుకే ముందు తెలంగాణ ప్రజలకు బండి సంజ‌య్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  తెలంగాణకు, ములుగు ప్రజలకు బీజేపీ ఏ ఒక్క మేలు చేయలేద‌న్నారు. కేంద్రం ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హక్కులను కాలరాసే బీజేపీకి ఈ ఎన్నికల్లో త‌గిన‌ బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.

ఆ రాళ్లు బీజేపీని స‌మాధి చేసే రాళ్లు..

ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో బీజేపీ నేతలు కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. మానుకోటకు వచ్చి ఆ రాళ్ల గురించి మాట్లాడుతున్నారు. ఆ రాళ్ళు తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడే బీజేపీని సమాధి చేసే రాళ్ళు అని గుర్తు పెట్టుకోవాల‌ని హెచ్చ‌రించారు. గోదావరి నది పారుతున్న ఈ జిల్లా గురించి గత పాలకులు పట్టించుకోకపోతే ఆ నీటిని నేడు ములుగులో ప్రతి ఎకరం పారే విధంగా ఇక్కడ ఒక చీఫ్ ఇంజినీర్ ను పెట్టి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రామప్పను ఇప్పటికే రిజర్వాయర్ చేసుకున్నాం. దేవాదుల నీటితో దీని ద్వారా నీరు ఇవ్వనున్నం. పాలెం వాగు, మోడీ కుంట వాగు, రామన్నగూడెం పనులు త్వరలో మొదలు కాబోతున్నాయి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమ‌న్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడిన రాష్ట్రం వాటిని సాధించే విధంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తూ ముందుకెళ్తుంద‌న్నారు.

ప్ర‌శ్నించే గొంతులు కాదు.. ప‌రిష్క‌రించే చేతులు కావాలి..

తెలంగాణ‌లో అమలు అవుతున్న సంక్షేమ‌ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదో బండి సంజ‌య్ చెప్పాల‌న్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. లేకపోతే మానుకోట వంటి రాళ్ళు ములుగులో కూడా సిద్ధం అవుతాయ‌న్నారు. ప్రజల కష్టాలు తెలిసి వారి మధ్య ఉంటున్న వ్య‌క్తి పల్లా రాజేశ్వర్ రెడ్డి. వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రశ్నించే గొంతుకల‌ కంటే పరిష్కారం చేసే చేతులు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి పరిష్కరించే నాయకులకు ఓటేసి గెలిపించాల్సిందిగా మ‌న‌వి చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.