ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం దేశం కోసం.. ధర్మం కోసమేనా?
 • విశాఖ ఉక్కుపోరాటానికి సంపూర్ణ మద్దతు 
 • అవసరమైతే ప్రత్యక్షంగా పోరాటంలోకి 
 • కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం దేశం కోసం.. ధర్మం కోసమేనా? 
 • ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఏకతాటిపై రావాలి
 • కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలి
 • విద్యుత్తు ప్రైవేటీకరణనూ సహించేది లేదు
 • బీహెచ్‌ఈఎల్‌, ఎల్‌ఐసీ, సింగరేణిలను
 • ప్రోత్సహిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
 • రాష్ట్రంలో పన్నులు పెరిగాయా?
 • రాష్ట్రమంతటా 24 గంటల కరెంట్‌ 
 • గరిష్ఠ విద్యుత్తు తలసరి వినియోగం
 • మేం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం
 • అభివృద్ధిని చూసి మద్దతివ్వండి
 • ట్రస్మా, విద్యుత్తు ఇంజినీర్లు, 
 • కేంద్ర ఉద్యోగులతో మంత్రి కేటీఆర్‌

దేశ వ్యాప్తంగా లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం ఇష్టారీతిగా అమ్మటం ద్వారా ఉద్యోగులు అందోళనకు గురికావాల్సివస్తున్నది. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కుగా ఉద్యమించి సాధించుకున్న వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మేందుకు సిద్ధమైంది. ఈ విషయంలో మౌనం వహిస్తే రేపు సింగరేణిని సైతం అమ్మే కుట్రలు చేస్తుంది.

-మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘బేచో ఇండియా’ నినాదాన్ని ఎత్తుకున్నదని, ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడమే బీజేపీ నయా ఎజెండాగా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. దేశం కోసం, ధర్మం కోసమే ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్ముతున్నారా? అని ప్రశ్నించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హైదరాబాద్‌లో వేర్వేరు సమావేశాల్లో ట్రస్మా, విద్యుత్తు ఇంజినీర్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి కేటీఆర్‌ మాట్లాడారు. తమ పార్టీ తరఫున హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి పోటీచేస్తున్న ఎస్‌ వాణీదేవి, వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ స్థానం నుంచి పోటీచేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మొదటి ఏకైక ప్రాధాన్యత ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు.

ప్రభుత్వరంగ సంస్థల పట్ల కేంద్రం వివక్షను ఎండగట్టారు. విశాఖ ఉక్కు పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కుగా ఉద్యమించి సాధించుకున్న వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో మనం మౌనం వహిస్తే రేపు సింగరేణిని సైతం అమ్మేస్తారని హెచ్చరించారు. హరిత ప్లాజాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్‌ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్మినా మనం స్పందించాలని పిలుపునిచ్చారు.

నష్టాల్లో  ఉన్న సింగరేణిని బతికించుకోవటం, కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని చెప్పారు. ఫలితంగా ఇవాళ ఆ సంస్థ లాభాల బాటలో పయనిస్తున్నదని వివరించారు. బీహెచ్‌ఈఎల్‌ బలోతానికి రూ.35 వేల కోట్ల ఆర్డర్లు ఇచ్చి బతికించుకున్న చరిత్ర టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదన్నారు. ఎల్‌ఐసీకి రూ.1400 కోట్ల బీమా ప్రీమియం చెల్లించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. దేశవ్యాప్తంగా లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్ముతుంటే ఉద్యోగులు అందోళనకు గురికావాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో టీఆర్‌ఎస్‌కు విడదీయరాని బంధం ఉన్నదన్నారు.

ఉద్యమ సమయంలో ఉద్యోగులతో భుజం భుజం కలిపి పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఏకతాటిపైకి వచ్చి ప్రైవేటీకరణలను అడ్డుకోవాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాలు, ప్రజల సంక్షేమం అంతా ప్రభుత్వ రంగ సంస్థల భవిష్యత్తు పైనే ఆధారపడి ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు. దేశ సంపదను ప్రైవేట్‌పరం చేయటమే పాలనగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, దీన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

భారీ పెట్టుబడులతో రాష్ట్ర విద్యుత్‌ రంగాన్ని అభివృద్ధి చేస్తే.. ప్రైవేటీకరించేందుకు కేంద్రం విద్యుత్‌ చట్టం తీసుకువచ్చిందని విమర్శించారు. దీన్ని తాము ఏమాత్రం సహించబోమన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబుయాదవ్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రూప్‌సింగ్‌, బీహెచ్‌ఈఎల్‌ సంఘం నుంచి ఎల్లయ్య, బీడీఎల్‌ నుంచి దానకర్ణాచారి, రమణారెడ్డి, హెచ్‌ఏఎల్‌ నుంచి రవీంద్ర ముదిరాజ్‌, ఎన్‌ఎఫ్‌సీ నుంచి రాజారెడ్డి, పోస్టల్‌ సంఘం నుంచి వెంకటేశ్వర్లు, ఈసీఐఎల్‌ నుంచి బాల నర్సింహ, హెచ్‌ఎంటీ నంచి గిరిధర్‌, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ నుంచి సుకన్య పాల్గొన్నారు.

ఏ ధర్మం కోసం ధరలు పెంచిన్రు?

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నంతకాలం అప్పటి ప్రధాని మన్మోహన్‌ అసమర్థత వల్లే గ్యాస్‌, పెట్రోల్‌ డీజిల్‌ ధరలు పెరిగాయని విమర్శించిన నాటి గుజరాత్‌ సీఎం, నేటి ప్రధాని మోదీ.. ఇప్పుడు ఏ ధర్మం కోసం వాటి ధరలు పెంచారో జవాబివ్వాలని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. అభివృద్ధి, ధరలపై ప్రశ్నిస్తే మతం పేరుతో ప్రజలను బీజేపీ నేతలు తప్పుదోవ పట్టిస్తారన్నారు. మోదీ అధికారం చేపట్టడానికి ముందు రూ.400 ఉన్న గ్యాస్‌ ధర రూ.870కి పెరిగిందన్నారు. 2014 నుంచి తమ సర్కార్‌ ప్రజలపై ఒక్క రూపాయి కూడా పన్నుల భారం మోపలేదని గుర్తుచేశారు. జలవిహార్‌లో ట్రెస్మా ఉద్యోగుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. టీఆర్‌ఎస్‌ ఓట్లకోసం.. సీట్ల కోసం పనిచేయదని.. ఏ పని చేసినా చిత్తశుద్ధితో ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. కరోనా వల్ల గతేడాది 1.80 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టుకున్నప్పటికీ.. రూ.52 వేల కోట్లు నష్టంరావడంతో సమస్యలొచ్చాయన్నారు. హెలికాప్టర్‌ మనీ విధానంతో రాష్ర్టాలను ఆదుకోవాలని సీఎం సూచించినా కేంద్రం పట్టించుకోలేదని గుర్తుచేశారు.

కేంద్రం ఇచ్చింది సున్నా

కేంద్రంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్‌ ఇద్దరూ ఒకేసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో 287 కొత్త విద్యాసంస్థలు వస్తే రాష్ర్టానికి ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం రద్దుచేస్తే ఇక్కడి బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేక పోతున్నారని ప్రశ్నించారు. ఎవరికి ఓటేస్తే.. ఎవరికి మద్దతిస్తే మంచిదో ఆలోచించాలని పట్టభద్రులను కేటీఆర్‌ కోరారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వాణీదేవి సమస్యలను పరిష్కరించే గొంతుక అవుతారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. పైవేట్‌ విద్యాసంస్థల్లో కేజీటూపీజీ వరకు ఉన్న సమస్యలను క్షుణ్ణంగా చర్చించి త్వరగా వాటి పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.  ఈ సమావేశంలో ట్రస్మా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉమా మహేశ్‌రావు, షేక్‌ సయ్యద్‌ అహ్మద్‌, కోశాధికారి మంచాల రఘు, ముఖ్య సలహాదారులు ఎస్‌. శ్రీనివాస్‌రెడ్డి, సలహాదారులు ఎస్‌. మధుసూదన్‌ పాల్గొన్నారు.

విశాఖ ఉక్కు పోరుకు మద్దతు

ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పోరాడి సాధించుకొన్న విశాఖ ఉక్కును వందశాతం అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి జరుగుతున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు. అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతితో విశాఖకు వెళ్లి ప్రత్యక్షంగా వారి పోరాటానికి మద్దతిస్తామని అన్నారు. ‘ఎక్కడో విశాఖలో జరిగే ఉద్యమాన్ని మనకెందుకులే అనుకుంటే రేపు మన దగ్గరకూ వస్తారు. విశాఖ ఉక్కును అమ్ముతున్నట్టుగానే రేపు బీహెచ్‌ఈఎల్‌, ఎల్లుండి సింగరేణిని అమ్ముతారు’ అని హెచ్చరించారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రైవేట్‌పరం చేయాలంటారేమో అని ఎద్దేవాచేశారు. తెలంగాణలో పీఎస్‌యూలను అమ్మే ప్రయ త్నం జరిగితే ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రభుత్వ సంస్థలను ఇక్కడ కాపాడుకుంటుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నదని అన్నారు.

చీకట్ల నుంచి వెలుగులోకి

 • విద్యుత్‌ ఇంజినీర్ల సంఘం 
 • సమావేశంలో కేటీఆర్‌ 

చావుకు వెళ్లిన వారి స్నానాలకు 15 నిమిషాల కరెంట్‌ ఇవ్వలేని స్థితి నాటిది.. పట్టణం నుంచి మారుమూల ఉన్న తండా వరకు 24 గంటల కరెంట్‌ ఇస్తున్న పరిస్థితి నేటిది. దీనికి విజన్‌ ఉన్న నాయకుడు కేసీఆర్‌ నేతృత్వంలో శ్రమించిన విద్యుత్‌ ఇంజినీర్లే ప్రధాన భూమిక అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మేడ్చల్‌ జిల్లాలోని కేఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌లో బుధవారం జరిగిన తెలంగాణ విద్యుత్‌ ఇంజినీర్ల సంఘం సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్‌ చుట్టూ అల్లుకున్న జీవితం తెలంగాణదన్నారు. ‘బోరుబావుల మీద ఆధారపడిన వ్యవసాయానికి నీళ్లు కావాలంటే కరెంట్‌ కావాలి, పరిశ్రమలు నడవాలంటే కరెంట్‌ కావాలి, ఊళ్లలో తాగునీళ్లు కావాలంటే నీళ్లు, నేతన్న మరమగ్గాలు నడవాలంటే కరెంట్‌ కావాలి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కరెంట్‌కు సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేసి, భారీగా నిధులు కేటాయించారు. ఫలితంగా ఉత్పత్తి సామర్థ్యం 16,300 మెగావాట్లకు పెరిగింది’ అని చెప్పారు. నేడు రాష్ట్రం దేశంలోనే అత్యధిక విద్యుత్‌ తలసరి వినియోగం (2071 యూనిట్లు)తో ముందంజలో ఉన్నదన్నారు. విద్యుత్‌ ఉద్యోగులు, తమకు ఉద్యమకాలంనుంచి పేగుబంధమున్నదని.. వారుతాము వేరువేరు కానేకాదని చెప్పారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎస్‌ వాణీదేవి అన్నివిధాలా అర్హులైన అభ్యర్థులని, వారిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, విద్యుత్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ, ప్రధాన కార్యదర్శి రామేశ్వర్‌శెట్టి, మేడ్చల్‌ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ దీపికానర్సింహరెడ్డి, వివిధ జిల్లాలకు చెందిన సంఘం నాయకులు పాల్గొన్నారు.