విశాఖ ఉక్కు కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపిన తెలంగాణ మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ : ఏపీలోని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ వ్యతిరేరించారు. రికగ్నైజ్డ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో కరస్పాండెన్స్‌, టీచర్ల సమావేశం నగరంలోని జలవిహార్‌లో బుధవారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్ర  ప్రభుత్వ సంస్థలను, ఉద్యోగులను ఏ విధంగా ప్రోత్సహిస్తూ, సంరక్షించుకుంటున్న విషయాన్ని అదేవిధంగా బీజేపీ, ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా ఏ విధంగా ప్రైవేటీకరిస్తూ వాటిపై ప్రత్యక్షంగా ఆధారపడ్డ వేలాదిమందిని, పరోక్షంగా ఆధారపడ్డ లక్షలమంది పొట్టకొట్టడాన్ని సరిపోల్చి చెప్పారు. ఈ క్రమంలో మంత్రి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకించారు.

ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రైవేటుపరం చేస్తారు..

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న విశాఖ స్టీల్‌ కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటుపరం చేస్తోందన్నారు. విశాఖ ఉక్కు కోసం చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. అవసరమైతే సీఎం కేసీఆర్‌ అనుమతితో వైజాగ్‌ వెళ్లి ఉద్యమంలో పాల్గొంటామన్నారు. తెలంగాణ సమస్యలపై కూడా వారు తమకి మద్దతు ఇవ్వాలన్నారు. ఇలానే ఉంటే ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రైవేటుపరం చేస్తారని పేర్కొన్నారు.

స్టీల్‌ ప్లాంట్‌ నష్టాలకు ఇది కూడా ఓ కారణమే..

సొంత గనుల లేకపోవడం కూడా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నష్టాలకు కారణంగా సమాచారం. గనులు కేటాయించాలని ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లను కోరినప్పటికీ కేంద్రం కేటాయించలేదు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ మాత్రం నష్టాల్లోనే కొనసాగినట్లు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ సమాధానమిచ్చారు. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసిన వైసీపీ ఎంపీలు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని కోరారు.