ఉద్యమకారుడు నుండి రాష్ట్ర మంత్రి వరకూ

మంత్రి ఈటెల రాజేందర్ ప్రస్థానం

అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం విప్లవకారుడయ్యారు.. దోపిడి, వివక్ష, అవమానం, అణచివేత, పరాయిపాలన నుంచి తెలంగాణ తల్లి విముక్తి కోసం ఉద్యమకారుడయ్యారు.. అధినేత ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆర్థిక మంత్రిగా రాష్ట్ర పద్దును పదునెక్కించారు.. నాడీ తెలిసిన వైద్య మంత్రిగా ప్రజల ఆరోగ్యానికి రక్షణ కవచంలా నిలిచారు. కష్టకాలంలో ఫ్రంట్‌ వారియర్‌గా మారి కరోనాను కట్టడి చేశారు. ఆయనే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం..

ఈటల రాజేందర్‌.. ఉద్యమకారుడి నుంచి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన బడగు బలహీన వర్గాల నేత. ఆయన మంత్రి కన్నా అసలు సిసలు తెలంగాణ ఉద్యమకారుడిగానే సుపరిచితం.ఆయనకు ఏ పదవి ఇచ్చినా.. ఆయనే పని చేసినా ప్రజల కోణంలో ఆలోచించి చేయడం ఆయన నేర్చుకున్న రాజనీతి. పరిపాలన కూడా ఉద్యమ పంథాలోనే చేయడం ఆయనకు అబ్బిన విప్లవ పంథా. తెలంగాణ రాష్ట్రసమితిలో అగ్ర నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఈటల రాజేందర్‌ హుజురాబాద్‌ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా ఎంపిక అయ్యారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో ప్రణాళికశాఖ, చిన్నమొత్తాల పొదుపు, రాష్ట్ర లాటరీలు, పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలు నిర్వర్తించాడు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆయన ఆప్త మిత్రుడు. టీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఈటెల 2001 లో కేసీఆర్ పార్టీ ప్రారంభించిన నాటి నుంచి ఆయన వెన్నంటే ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1984 లో ఆయన బీఎస్‌సీ పూర్తి చేశారు.

 

2018 మధ్యంతర ఎన్నికల్లో ఆయన హుజురాబాద్ నియోజకవర్గం నుంచి పాడి కౌశిక్ రెడ్డిపై పోటీ చేశారు. 2014 మరోసారి హుజురాబాద్ సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్ రెడ్డిపై 57,037 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ నాయకుడు వీ.కృష్ణ మోహన్ రావుపై విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డిని ఓడించి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు.

ఈట రాజేందర్‌ మార్చి 20, 1964లో ఓ నిరుపేద కుటుంబంలో జన్మిచారు. బీఎస్సీ చదువుతున్న కాలంలోనే నాటి సామాజిక, రాజకీయ కారణాలతో విప్లవ భావాలకు ఆకర్షితులయ్యారు. ప్రజల కోసం విప్లవబాట పట్టారు. అనంతరం తెలంగాణ విముక్తి కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ సారథ్యంలో 14 ఏళ్లపాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో అధినేత కేసీఆర్‌ వెన్నంటే నిలిచారు. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న ఈటల.. ప్రజలకోసం అవసరమైతే పార్టీ అధినేతను కూడా ఎదిరించే నేతగా పేరు సంపాధించారు. తెలంగాణ తొలి ఆర్థిక మంత్రిగా ఎన్నో సవాళ్లను అదిగమించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్క దిద్దారు. వైద్య శాఖ మంత్రిగా కరోనా కష్టకాలంలో ఆయన చేసిన పనితీరు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంది.

ప్రతి ఒక్కరు మొక్కుల నాటాలని పిలుపు
తమ అభిమాన నేత జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలోని ఈటల అభిమానులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. అడుగడుగునా శుభాకాంక్షల బ్యానర్లతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే తన జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరు మొక్కులు నాటాలని మంత్రి పిలుపునిచ్చారు. అనవసరంగా ఇతర ఖర్చులకు పోకుండా ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని కోరారు.