లాక్ తప్పదా?
  • తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
  • కట్టడి చర్యలకు ప్రభుత్వం సమాయత్తం
  • ప్రభావిత నగరాల్లో పాక్షికంగా లాక్ డౌన్, ఆంక్షలు విధించే ఛాన్స్!

కరోనాపై త్వరలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది! తెలంగాణలో పాక్షికంగా లాక్‌డౌన్‌ను అమలు చేసే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. 

తెలంగాణలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో పదుల సంఖ్యలో విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఇంకోవైపు, సాధారణ ప్రజల నుంచి కేసుల తాకిడి పెరుగుతూ ఉంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. పాఠశాలల తాత్కాలిక మూసివేతకు సిద్ధమవుతోంది. అంతేకాక, రద్దీ ఎక్కువగా ఉండే సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ వంటివి ఉండే ప్రాంతాల్లో ఆంక్షలు విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.కరోనాపై త్వరలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది! తెలంగాణలో పాక్షికంగా లాక్‌డౌన్‌ను అమలు చేసే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో వారాంతాల్లో ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి.. ఆయా రోజుల్లో లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వారంలో కొద్ది రోజులు లాక్‌డౌన్‌తో పాటు రాత్రి వేళ కర్ఫ్యూ విధించడంపై సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే దేశంలోని కొన్ని నగరాలు కూడా లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. అంతేకాక, అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్దిష్ఠ సమయం కంటే ముందే ముగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.గతేడాది, దేశవ్యాప్తంగా మార్చి నెలాఖరులో వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలుత కఠిన లాక్‌ డౌన్ విధించి తర్వాత నిబంధనలు సడలిస్తూ వచ్చారు. కరోనా వైరస్ ప్రభావం కూడా నవంబరు నాటికి కాస్త తగ్గింది. మళ్లీ ఇప్పుడు రెండో వేవ్ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో ఎక్కువగా విద్యాసంస్థలు, హాస్టళ్లలో విద్యార్థులు కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్రంలో కొత్తగా మరో 337 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కొత్తగా 181 మంది బాధితులు వైరస్‌ బారినుంచి కోలుకోగా, మరో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,03,455కు చేరాయి. ఇందులో 2,98,826 మంది కోలుకోగా, 1671 మంది మరణించారు. ప్రస్తుతం 2958 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 1226 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 91 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న 37,079 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం కరోనా పరీక్షలు 96,50,662కు చేరాయి. కాగా, రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.55 శాతం, రికవరీ రేటు 98.52 శాతంగా ఉన్నదని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.