తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు…

ఈ మూడూ.. చేసి చూడు
‘పెట్టుబడి ఖర్చు తగ్గిస్తే.. ఆదాయం అదే పెరుగుతుంది’..వ్యవసాయంలో ప్రాథమిక సూత్రం, రైతులకు అధిక లాభాలు అందించే సాగుమంత్రం.కానీ, కొందరు దీన్ని మర్చిపోయి, భారీ పెట్టుబడులు పెడుతున్నారు.ఫలితంగా, రాబడికి గండి పడుతున్నది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించి, లాభాలు పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మూడు ముఖ్యమైన అంశాలను తెరపైకి తీసుకొచ్చింది.

వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమైన మూడు అంశాలను రైతుల ముందు ఉంచారు. వీటిని పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని ఇప్పటికే వ్యవసాయ శాఖకు దిశానిర్దేశం చేశారు. ఈ మూడు అంశాలూ క్షేత్రస్థాయిలో అమలైతే ఎరువులు, సాగునీరు, విద్యుత్‌ వంటి వనరులను ఆదా చేసుకోవడంతోపాటు.. రైతుకు పెట్టుబడి ఖర్చునూ భారీగా తగ్గించవచ్చని వ్యవసాయ శాఖ చెబుతున్నది. ఆయా అంశాలపై కార్యాచరణా మొదలైంది. ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ప్రతిపాదించిన మూడు అంశాలను పరిశీలిస్తే..

ఫాస్ఫరస్‌ నిల్వలు కరిగించడం..
వరి, మక్కజొన్న, ఇతర పంటల సాగులో యూరియాతోపాటు ఎన్‌పీకే కాంప్లెక్స్‌ ఎరువులు ప్రధానమైనవి. ఒక బస్తా రూ.1200 నుంచి రూ.1300 వరకూ పలుకుతున్నది. అయితే ఎన్‌పీకే ఎరువులు వాడినప్పుడు అందులోని ఫాస్ఫరస్‌ (భాస్వరం)ను 20శాతం మాత్రమే మొక్కలు తీసుకుంటాయి. మిగిలిన 80 శాతం, నేలలోనే ఘనరూపంలో ఉండిపోతున్నది. కొత్త పంట వేసిన ప్రతిసారీ రైతులు మళ్లీ మళ్లీ ఎరువులు వేస్తూనే ఉన్నారు. ఫలితంగా, పొలాల్లో భాస్వరం నిల్వలు విపరీతంగా పేరుకుపోయాయి. రాష్ట్రంలో సుమారు 154 మండలాల్లో అధిక భాస్వరం నిల్వలు కలిగిన నేలలు ఉన్నట్లు వ్యవసాయ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. ఈ నిల్వలను కరిగిస్తే మళ్లీ ఎన్‌పీఏ ఎరువులు వేయాల్సిన అవసరం లేకుండానే అధిక దిగుబడి పొందవచ్చని తేల్చింది. భాస్వరం నిల్వలను కరిగించే పద్ధతిని అవలంబిస్తే ఎకరానికి రూ.600 వరకు ఎరువుల ఖర్చును ఆదా చేసుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విధంగా, ఒక సాధారణ రైతు ఐదెకరాలలో వరి వేస్తే.. కనీసం రూ.3వేల వరకు పెట్టుబడి ఖర్చు ఆదా అవుతుంది. అయితే, నేలల్లోని భాస్వరం నిల్వలను కరిగించేందుకు జీవ ఎరువు (ఫాస్పేట్‌ సెలిబుల్లా బ్యాక్టీరియా)లను ఉపయోగించాలి. దీన్ని పశువుల ఎరువుతో గానీ నీటిలో గానీ కలిపి చల్లితే నేలలోని భాస్వరం నిల్వలను కరిగించి మొక్కలకు అందిస్తుంది. దీంతో, ఎకరానికి 2 కిలోల ఘన జీవ ఎరువు సరిపోతుంది. ఈవిధంగా రైతులు జీవ ఎరువులను ఉపయోగించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేల టన్నుల ఎరువుల వినియోగాన్ని నియంత్రించవచ్చు. సేద్యంలో ఖర్చునూ కొంతమేర తగ్గించవచ్చు.

వెదజల్లే పద్ధతితో..
ఇక రెండో అంశం.. వరి సాగులో నాటుకు బదులుగా వెదజల్లే పద్ధతిని అమలు చేయడం. రాష్ట్రంలో వరి సాగు గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో కూలీల కొరత తీవ్రమైన సమస్యగా మారింది. ఫలితంగా కూలీ రేట్లు భారీగా పెరిగాయి. మనిషికి రూ.400 నుంచి రూ.500 దాకా ఇవ్వాల్సి వస్తున్నది. ఈ విధంగా ఒక ఎకరానికి కూలీల ఖర్చే రూ.3 వేల నుంచి రూ.4 వేల దాకా అవుతున్నది. ఈ నేపథ్యంలో ‘మొలకలను వెదజల్లే పద్ధతి’ ప్రత్యామ్నాయంగా మారింది. ఈ విధానంలో కూలీల అవసరమే లేకుండా రైతే ఎన్ని ఎకరాల్లోనైనా వరి సాగు చేసుకోవచ్చు. ఈ విధానంలో పెద్ద కష్టం కూడా ఉండదు. అయితే, కొందరిలో ఆందోళనతోపాటు అవగాహన లేమి కనిపిస్తున్నది. ఫలితంగా వెదజల్లే పద్ధతిని అవలంబించేందుకు ధైర్యం చేయడం లేదు. ఈ నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి గ్రామంలోనూ కొందరు రైతులతో వెదజల్లే పద్ధతిద్వారా సాగు చేయించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఫలితంగా, ఆయా గ్రామాల్లోని మిగతా రైతులకు ఈ పద్ధతిపై నమ్మకం ఏర్పడే అవకాశం ఉన్నది. గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి కూడా కార్యాచరణను రూపొందిస్తున్నారు.

రైతు వేదికల ద్వారా..
ఇన్నేండ్లుగా సాగు ప్రణాళికపై చర్చించుకునేందుకు ఇటు రైతులకు గానీ, అటు అధికారులకు గానీ ఒక వేదికంటూ లేదు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో రైతు వేదికలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆయా గ్రామాల్లోని రైతులు ఏ పంటలు వేస్తే బాగుంటుందనే అంశంపై ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునే వీలుంది. అదే విధంగా, డిమాండ్‌ ఉన్న పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకూ అధికారులకు అవకాశం ఉంటుంది. గ్రామంలోని రైతులను రైతు వేదిక దగ్గరకు ఆహ్వానించి, ఆ సీజన్‌లో సాగు చేయాల్సిన పంటల గురించి వివరించవచ్చు. ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణకూడా ఇవ్వొచ్చు. ఈ నేపథ్యంలో సాగులో సమూల మార్పుల కోసం రైతు వేదిక కేంద్రంగా కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రైతులకు వేదికలవద్ద పంటల సాగుపై అవగాహన కల్పించడంతోపాటు శిక్షణకూడా ఇవ్వాలని సూచించింది. తద్వారా రైతులు ఏ పంటలు పడితే ఆ పంటలు వేయకుండా, డిమాండ్‌ ఉన్నవాటినే ఎంచుకునే వీలుంటుందనేది ప్రభుత్వ అభిప్రాయం. మొత్తంగా, ఈ మూడు అంశాలనూ అమలు చేస్తే.. సాగు లాభసాటి కావడం ఖాయం.