ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు…ప్రభుత్వానికే మా మద్దతు..
 • ప్రభుత్వానికే మా మద్దతు…ఉద్యోగ సంఘాల నేతలు
 • కేసీఆర్‌ మాకు హామీ ఇచ్చారు ఉద్యోగ, ఉపాధ్యాయ నేతల వెల్లడి
 • సీఎంను కలిసిన సంఘాలు సమస్యల పరిష్కారానికి వినతి
 • పలు అంశాలపై సీఎం హామీలు ముఖ్యమంత్రి నుంచి హామీ లభించిందంటూ ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడి

 

 • ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు
 • ప్రాథమిక పాఠశాలలకు 10 వేల హెచ్‌ఎం పోస్టులు
 • సీజీహెచ్‌ఎస్‌ తరహాలో రాష్ట్ర ఉద్యోగులకు హెల్త్‌స్కీమ్‌
 • కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, చిరుద్యోగులకూ వేతన లబ్ధి
 • కోడ్‌ ముగిసిన వెంటనే కారుణ్య నియామకాలు
 • సీపీఎస్‌ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్‌ అమలు
 • 2003 డీఎస్సీ టీచర్లకుపాత పెన్షన్‌ అమలు
 • ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లో సిబ్బంది నియామకం
 • స్కావెంజర్‌ పదం తొలగింపు పూర్తిస్థాయిలో శానిటేషన్‌ సిబ్బంది నియామకం
 • ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు స్వరాష్ర్టానికి

ఫిట్‌మెంట్‌తో సహా సమస్యలన్నీ వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చినట్టు తెలిసింది.రాష్ట్రంలో ప్రస్తుతం శాసనమండలి ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల కోడ్‌ ముగిసిన తక్షణమే ఉత్తర్వులు జారీచేస్తామని సీఎం తెలిపినట్టు ఉద్యోగసంఘాలు చెప్పాయి. ఏపీలో ఉద్యోగులకు ఇచ్చిన దానికంటే ఎక్కువే పీఆర్సీ ఇస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం కేసీఆర్‌ స్పష్టంచేసినట్టు తెలిసింది. పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచి, వెంటనే అమలు చేస్తామన్నారు. పీఆర్సీ నివేదికపై చర్చల్లో భాగంగా మంగళవారం ప్రగతిభవన్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ, అధికారుల సంఘాల ప్రతినిధులు సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సమావేశం దాదాపు నాలుగు గంటలపాటు కొనసాగింది.

సీపీఎస్‌ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్‌

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న సీజీహెచ్‌ఎస్‌ తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కోరుకొన్న కార్పొరేట్‌ దవాఖానకు వెళ్లి నగదు రహిత వైద్యం చేయించుకొనే పథకాన్ని అమలుచేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని ఉద్యోగనేతలు చెప్పారు. కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్‌ అమలుచేస్తామన్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చినట్టు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపా రు. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే కారుణ్య నియామకాలను చేపడతామని హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌తో సహా మొత్తం 9.50 లక్షల ఉద్యోగులున్నారని, అందరికీ సమానపనికి సమాన వేతనం ఇస్తామని సీఎం తెలిపారని వెల్లడించారు. ఆంధ్రాలో తెలంగాణకు చెంది న నాలుగో తరగతి, మినిస్టీరియల్‌ ఉద్యోగులు దాదాపు 800 మంది పనిచేస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు సీఎంకు సమాచారం ఇవ్వడంతో వారందరినీ వెంటనే తెలంగాణకు తీసుకొచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పదోన్నతులు ఇవ్వాలని, భార్యాభర్తల (స్పౌజ్‌) కేసులు తక్షణం పరిష్కరించా ని సీఎం ఆదేశించినట్టు ఉద్యోగనేతలు చెప్పారు.

ఉద్యోగ సంఘాలు బలంగా ఉండాలి

కరోనాతో రాష్ట్ర ప్రభుత్వంపై సైతం ఆర్థికభారం పడిందని, అయినప్పటికీ ఉద్యోగుల జీతభత్యాలపై దీని ప్రభావం లేకుండా చేస్తామని సీఎం కేసీఆర్‌ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఖజానాకు నిధులు వచ్చేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారని ఉద్యోగసంఘాల నేతలు అన్నారు. ఉద్యోగ సంఘాలు బలంగా ఉండాలని, తాను కూడా అండగా, అందుబాటులో ఉంటానని సీఎం సంఘాల నేతలకు ఈ సందర్భంగా చెప్పా రు. పీఆర్సీ, ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌, పదవీ విరమణ వయసు పెంపు అంశాలపై కోడ్‌ ముగిసిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో సవివరంగా చెప్తానని ఉద్యోగులకు సీఎం తెలిపారు. వీఆర్వోలను సొంత శాఖలోనే సర్దుబాటు చేస్తానన్నారని, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ కాలపరిమితిని మూడేండ్ల నుంచి తగ్గించే అంశంపై సానుకూలంగా స్పందించారని ఉద్యోగ నేతలు చెప్పారు. ఈ భేటీలో ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, జేఏసీ సెక్రటరీ జనరల్‌, టీజీవో అధ్యక్షురాలు మమత, టీఎన్జీవో మహిళావిభాగం అధ్యక్షురాలు రేచల్‌, సచివాలయ సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ప్రతా ప్‌, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, పీఆర్టీయూ అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్‌ పాల్గొన్నారు.

కోడ్‌ ముగియగానే టీచర్లకు పదోన్నతులు

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ముగియగానే ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన అమలుచేసి నెలరోజుల్లోనే పూర్తిచేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని ఉద్యోగ నాయకులు వెల్లడించారు. కాంట్రాక్టు లెక్చరర్లు, టీచర్ల క్రమబద్ధీకరణ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని, వీరికి ఈ పీఆర్సీలోనే మెరుగైన వేతనాలు ఇస్తామన్నారని పేర్కొన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తామని సీఎం చెప్పారన్నారు. పాఠశాలల్లో శానిటేషన్‌ సిబ్బందిని నియమిస్తామని, స్కావెంజర్‌ పదాన్ని తొలగిస్తామని సీఎం తెలిపినట్టు ఉద్యోగనేతలు చెప్పారు. ప్రాథమిక పాఠశాలలకు 10 వేల ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరుచేసి, పదోన్నతుల ద్వారా నియమిస్తామని సీఎం వెల్లడించినట్టు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. టీచర్ల ఇతర సమస్యల పరిష్కారంతోపాటు ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లో పూర్తిస్థాయి సిబ్బంది నియమకాలు, కాంట్రాక్ట్‌, ఉద్యోగుల వేతనాల పెంపు చేపడతామని హామీ ఇచ్చారని తెలిపారు.