తల్లి శవాన్ని తాకడానికి కన్న కొడుకే వెనకంజ

మహబూబాబాద్ జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కరోనాతో తల్లి చనిపోతే ఆమె శవాన్ని తాకడానికి కన్న కొడుకే వెనకంజ వేశాడు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా అతను ముందుకు రాకపోవడంతో కోడలు రంగంలోకి దిగడం గమనార్హం. పీపీఈ కిట్లు ధరించి ఆమె అత్తగారి మృతదేహాన్ని అంత్యక్రియలకు మరో మహిళతో కలిసి సిద్ధం చేసింది. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం చర్లపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కన్నతల్లి శవాన్ని తాకడానికి కొడుకే భయపడగా, కోడలే తోడుగా నిలిచి మరో మహిళతో కలిసి అత్త అంత్యక్రియలు పూర్తిచేసింది. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం చర్లపల్లికి చెందిన కె.బుచ్చమ్మ (75)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు కొంత కాలం క్రితమే చనిపోయాడు. అతని భార్య సునీత అత్త బుచ్చమ్మతో కలిసి నివసిస్తోంది.

బుచ్చమ్మ సోమవారం కరోనా వల్ల ఇంట్లోనే చనిపోయింది. ఇది తెలిసి ఆమె రెండో కుమారుడు భయంతో పారిపోయాడు. ఇద్దరు కుమార్తెలున్నా.. కరోనాతో బాధపడుతూ బయటకు రాలేని పరిస్థితి. దీంతో సునీత ధైర్యం చేసి, వారి గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగావత్‌ శిరీషతో కలిసి పీపీఈ కిట్లు ధరించింది. అత్త మృతదేహాన్ని జేసీబీతో గ్రామ శివారు వరకూ తరలించి అక్కడ అంత్యక్రియలు పూర్తి చేయించింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.