భైంసా పట్టణంలో పరిస్థితి అదుపులోనే ఉంది : హోంమంత్రి

నిర్మల్‌ : భైంసా పట్టణంలో పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. ఘర్షణలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూస్తున్నామని పేర్కొన్నారు. అల్లరిమూకల ఆటకట్టించేందుకు అవసరమైనంత భద్రతా దళాలను మోహరించినట్లు చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆదివారం రాత్రే డీజీపీ మహేందర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌, ఎస్పీలతో పరిస్థితిపై సమీక్షించినట్లు హోంమంత్రి వెల్లడించారు. శాంతిభద్రత విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.

భైంసా పట్టణంలో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవ.. ఘర్షణకు దారితీయడంతో పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. జుల్ఫేకార్‌గల్లీ, కుభీరు రహదారి, గణేశ్‌నగర్‌, మేదరిగల్లీతోపాటు బస్టాండు ప్రాంతాల్లో  ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు అల్లరిమూకలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగా కొందరు వాహనాలు, దుకాణాలకు నిప్పంటించడంతో అవి దహనమయ్యాయి. ఈ ఘర్షణల్లో చిన్నారులు, మహిళలు, ఓ ఎస్సై, కానిస్టేబుల్‌తోపాటుగా ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది గాయపడ్డారు.