హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఇప్పటికే 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరికొందరు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. టీఆర్‌ఎస్ నుంచి నోముల భగత్‌కుమార్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, బీజేపీ నుంచి పానుగోతు రవికుమార్ నామపత్రాలు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలు చేసేందుకు నేడు చివరి అవకాశమని అధికారులు తెలిపారు. రేపటి నుంచి నామినేషన్ల పరిశీలించనుండగా.. ఏప్రిల్ మూడో తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందని అధికారులు పేర్కొన్నారు.
మంత్రులతో కలిసి నామినేషన్ వేయనున్న భగత్‌కుమార్
నాగార్జునసాగర్ శాసనసభ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కుమార్ నిడమనూరు తాసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉప ఎన్నికల నియోజకవర్గ ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు పేర్కొన్నారు. నామినేషన్ కార్యక్రమాన్ని సాదాసీదాగా నిర్వహిస్తున్నామని, సభలు, ర్యాలీలు ఉండబోవని అన్నారు. పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులెవరూ రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.