నో మోర్ లాక్ డౌన్ : సీఎం కేసీఆర్

‌తెలంగాణ‌లో లాక్‌డౌన్ విధించం అని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు శాస‌న‌స‌భ వేదిక‌గా ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు. లాక్‌డౌన్ అనేది పెట్టం. ప‌రిశ్ర‌మ‌ల మూసివేత ఉండ‌దు. ఇప్ప‌టికే చాలా దెబ్బ‌తిన్నాం. క‌రోనా నియంత్ర‌ణ‌కు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. మాస్కులు ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తే క‌రోనాను నియంత్రించొచ్చు. బాధ‌తోనే స్కూళ్ల‌ను మూసివేశాం అని సీఎం స్ప‌ష్టం చేశారు. విద్యాసంస్థ‌ల‌ను తాత్కాలికంగానే మూసివేశామ‌న్న విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ గ్ర‌హించాల‌న్నారు.

క‌రోనా విష‌యంలో మ‌న రాష్ర్ట ప్ర‌భుత్వం భేష్‌గా ఉంది. టెస్టుల సంఖ్య‌ను పెంచాం. నిన్న ఒక్క‌రోజే 70 వేలు టెస్టులు చేశారు. పిల్ల‌ల భ‌విష్య‌త్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థ‌ల‌కు తాత్కాలికంగా సెల‌వులు ప్ర‌క‌టించాం. సినిమా థియేట‌ర్ల యాజమాన్యాల‌కు కొన్ని వెసులుబాట్లు క‌ల్పించి… కేంద్రం నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా థియేట‌ర్ల‌ను ఓపెన్ చేశాం. క‌రోనా వ‌ల్ల మ‌నం ఒక్క‌రం కాదు.. ప్ర‌పంచం దేశం కూడా చాలా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటుంది. క‌రోనా ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌కుండా సంవ‌త్స‌ర కాలంగా ప్ర‌పంచాన్ని వేధిస్తోంది. అన్ని దేశాల జీడీపీలు కుప్ప‌కూలాయి. జీడీపీలో మ‌నం మెరుగ్గా ఉన్నాం. అనేక రాష్ర్టాలు మైన‌స్‌లో ఉన్నాయి. 10.85 ల‌క్ష‌ల మందికి వ్యాక్సినేష‌న్ ఇచ్చాం. వ్యాక్సిన్ ఇచ్చే అంశం కేంద్రం ప‌రిధిలో ఉంది. డోసుల త‌యారీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం రాష్ర్టాల‌కు స‌మానంగా పంపిణీ చేస్తోంది. వ్యాక్సినేష‌న్‌కు ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటుంది అని సీఎం తెలిపారు.