పుర పోరుకు ఏర్పాట్లు వేగవంతం

రాష్ట్రంలో కొన్ని పురపాలక, నగరపాలక ఎన్నికలకు ఈ నెలలోనే నగారా మోగనుంది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ఫలితాలకంటే ముందే వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లు సహా ఐదు పురపాలక సంఘాలకు ఎన్నికలు పూర్తికానున్నాయి. ఈనెల 17న సాగర్‌ ఎన్నిక జరగనుంది. అంతకంటే ముందే ప్రకటన విడుదల చేసి ఈనెల 30న పుర ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. సాగర్‌ ఓట్ల లెక్కింపు మే 2న జరగనుంది. ఈలోపే పుర ఎన్నికలు పూర్తికానున్నాయి. వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థలు, ఐదు పురపాలక సంఘాలతో పాటు జీహెచ్‌ఎంసీలోని లింగోజిగూడ డివిజన్‌ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ సి.పార్థసారధి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పురపాలక కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పుర ఎన్నికల ప్రక్రియ మొదలైందని తెలిపారు. ఓటర్ల జాబితాల ప్రచురణ, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు ప్రక్రియకు నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు తెలిపారు. పురపాలకశాఖ డైరెక్టర్‌ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారని చెప్పారు. అవసరమైన సిబ్బందిని నియమించుకోవడం, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, భద్రతా ఏర్పాట్లు, బ్యాలెట్‌ పత్రాల ముద్రణ సహా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలన్నారు. రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులను నియమించుకుని 12వ తేదీ లోపు శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించారు.
జీహెచ్‌ఎంసీ అంతటా కోడ్‌
నోటిఫికేషన్‌ జారీ అయినప్పటి నుంచి ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, పురపాలక సంఘాల్లో ఎన్నికలకోడ్‌ అమల్లో ఉంటుంది. హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో లింగోజిగూడ డివిజన్‌ నుంచి ఎన్నికైన కార్పొరేటర్‌ మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఫలితంగా జీహెచ్‌ఎంసీ అంతటా 15 రోజులపాటు ఎన్నికల కోడ్‌ అమలవుతుంది. ఎన్నికలఏర్పాట్లు సజావుగా జరిగేలా పర్యవేక్షించాలని పార్థసారథి కలెక్టర్లను ఆదేశించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో పురపాలకశాఖ డైరెక్టర్‌ సత్యనారాయణ, ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం పూర్తికాగానేబుధవారం సాయంత్రానికి రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులనియామకాన్ని పూర్తిచేశారు.

షెడ్యూలు ఇదీ..
ఓటర్ల తుది జాబితా ప్రచురణ: ఈనెల 11
పోలింగ్‌ కేంద్రాల జాబితా ప్రచురణ: 14వ తేదీ
ఎన్నికలు జరిగేవి 
నగరపాలక సంస్థలు: వరంగల్‌, ఖమ్మం
పురపాలికలు: సిద్దిపేట, అచ్చంపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్‌
డివిజన్‌: జీహెచ్‌ఎంసీలోని లింగోజిగూడ