దూసుకెళ్తున్న కారు

హైదరాబాద్‌: నల్లగొండ- వరంగల్‌-ఖమ్మం ఎమ్మెల్సీ మొదటిరౌండ్‌ ఫలితం విడుదలైంది. ఒక్కో రౌండ్‌లో 56 వేల ఓట్లను లెక్కిస్తున్నారు. ఒక్కో రౌండ్‌ లెక్కించడానికి ఐదు గంటల సమయం పడుతుంది. మొదటి రౌండ్‌ మొదటి ప్రాధాన్యత ఔట్ల లెక్కింపు ముగిసే సమయానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఓట్లతో ముందజలో ఉన్నారు. మొదటి రౌండ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 16130 ఓట్లు రాగా, తీన్‌మార్‌ మల్లన్నకు 12046 ఓట్లు, ప్రొఫెసర్‌ కోదండరాంకు 9080 ఓట్లు వచ్చాయి. మూడుస్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేంధర్‌రెడ్డికి 6615 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 4354 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్‌లో 2789 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన సమీప ఇండిపెండెంట్‌ ప్రత్యర్థి మల్లన్న కన్నా 4084 ఓట్ల ముందంజలో ఉన్నారు.

ఇక హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎస్‌ వాణీదేవి ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం. ఇక్కడ తొలి రౌండ్‌ ఫలితం గురువారం ఉదయం ఏడు గంటలకు వెలువడే అవకాశం ఉన్నది. రెండు స్థానాల ఓట్ల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం ఇటు హైదరాబాద్‌, అటు నల్లగొండలో ప్రారంభమైంది. ముందుగా తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఉదయం 6.30 గంటలకే స్ట్రాంగ్‌రూమ్‌లను తెరిచిన అధికారులు తొలుత 25 ఓట్ల చొప్పున కట్టలు కట్టారు. ఈ ప్రక్రియ నల్లగొండలో సాయంత్రం ఆరు గంటల వరకు, హైదరాబాద్‌లో రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. అనంతరం తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం ప్రారంభించారు. మొత్తం పోలైన ఓట్లను ఏడు రౌండ్లుగా విభజించి ఒక్కో రౌండ్‌లో 56వేల ఓట్ల చొప్పున తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఒక్కో రౌండ్‌కు నాలుగు నుంచి ఏడు గంటల సమయం పడుతున్నట్టు అధికారులు తెలిపారు. రెండు స్థానాల్లోనూ ఏడు రౌండ్లలో లెక్కింపును పూర్తిచేయనున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఏ ఒక్కరికి 50శాతానికి మించి ఓట్లు రాకపోతే తిరిగి రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. అదే జరిగితే తుది ఫలితం శుక్రవారం వెలువడే అవకాశం ఉంటుంది.

హైదరాబాద్‌లో

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ సుదీర్ఘంగా సాగుతున్నది. సరూర్‌నగర్‌లోని ఇండోర్‌ స్టేడియంలో జరుగుతున్న లెక్కింపు ప్రక్రియలో.. బుధవారం ఉదయం 6.30 గంటలకు ఎన్నికల పరిశీలకులు హర్‌ప్రీత్‌సింగ్‌, రిటర్నింగ్‌ అధికారి ప్రియాంక అల, అభ్యర్థుల సమక్షంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేశ్‌కుమార్‌ స్ట్రాంగ్‌రూమ్‌లను తెరిచారు. ఆనంతరం బ్యాలెట్‌ బాక్స్‌లను కౌంటింగ్‌ టేబుళ్లపైకి తరలించారు. ఉదయం 8 గంటలకు జంబో బాక్స్‌లోని బ్యాలెట్‌ పేపర్లను డ్రమ్ములో కలిపేసి 25 ఓట్ల చొప్పున ఒక కట్ట కట్టారు. రాత్రి 11 గంటల వరకు బండిల్స్‌ కట్టే ప్రక్రియను పూర్తిచేశారు. అనంతరం మొదటి రౌండు ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. నియోజకవర్గం పరిధిలోని 5.31 లక్షల ఓట్లకు గానూ 3,57,354 ఓట్లు పోలయ్యాయి. బరిలో 93 మంది అభ్యర్థులు ఉండటం, బ్యాలెట్‌ పేపర్‌ వార్తా పత్రిక సైజులో ఉండటంతో ఒక్కో బ్యాలెట్‌ పత్రాన్ని పరిశీలించేందుకు దాదాపు 2-3 నిమిషాలు పడుతున్నది. కౌంటింగ్‌ సిబ్బందిని షిఫ్టులవారీగా నియమిస్తూ ఒక్కో షిప్టు 12 గంటల చొప్పున ఓట్లు లెక్కిస్తున్నారు.

మొదటి రౌండ్‌కు ఆరుగంటలు

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానంలో తొలి రౌండ్‌ లెక్కింపు పూర్తయ్యే సరికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 15,990 ఓట్లు పోలయ్యాయి. రెండో స్థానంలో తీన్మార్‌ మల్లన్న నిలువగా ఆయనకు 12,000 ఓట్లు, మూడో స్థానంలో కోదండరాంకు 9,800 ఓట్లు వచ్చినట్టు తెలిసింది. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి నాలుగో స్థానంలో, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములునాయక్‌ ఐదో స్థానంలో నిలిచారు. లెఫ్ట్‌ పార్టీల అభ్యర్థి జయసారథిరెడ్డి, తెలంగాణ ఇంటిపార్టీ అభ్యర్థి చెరుకు సుధాకర్‌, యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి రాణీరుద్రమరెడ్డి నామమాత్ర ప్రభావం చూపారు. కాగా రెండో రౌండ్‌ ఓట్ల లెక్కింపు రాత్రి 12గంటల సమయంలో మొదలైంది. ఇందులోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారని తెలిసింది. మొదటి రౌండ్‌ ఓట్ల లెక్కింపునకు ఆరు గంటల సమయం పట్టింది. మొత్తం ఏడు రౌండ్ల కౌంటింగ్‌ పూర్తయ్యే సరికి గురువారం మహ్యహ్నం రెండు గంటలు దాటవచ్చని అంచనా వేస్తున్నారు. వరుసగా నాలుగోసారి విజయం దిశగా టీఆర్‌ఎస్‌ స్పష్టమైన ఆధిక్యతను కనపరుసున్నది. శాసనమండలి పునరుద్ధరణ నాటి నుంచి ఇక్కడ 2007, 2009, 2015లలో టీఆర్‌ఎస్‌నే విజయఢంకా మోగిస్తూ వస్తున్నది. మరోసారి కూడా ఈ సిట్టింగ్‌ స్థానంలో టీఆర్‌ఎస్‌ జయకేతనం ఎగురవేసేలా దూసుకుపోతున్నది. ఈ స్థానంలో పోస్టల్‌ బ్యాలెట్లతో కలిపి మొత్తం 3,88,011 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలైంది.

విజయం నాదే: పల్లా

మరోసారి తన విజయం ఖాయమని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్‌ కేంద్రం ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో స్పష్టంగా టీఆర్‌ఎస్‌ ట్రెండ్‌ కొనసాగుతున్నదని చెప్పారు. కౌంటింగ్‌లో పోలైన ఓట్ల సరళిని చూస్తుంటే టీఆర్‌ఎస్‌ వరుసగా నాల్గోసారి జయకేతనం ఎగురవేయనుందని తెలిపారు.

మొదటి ప్రాధాన్యతలో తేలకుంటే రేపటి వరకు ఆగాల్సిందే

చెల్లుబాటు అయిన ఓట్లలో 50 శాతాన్ని మించి ఒక్క ఓటు వచ్చినా ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు తక్కువగా వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్‌ చేస్తే వారికి వచ్చిన బ్యాలెట్‌ పత్రాల్లో రెండో ప్రాధాన్యతను ఆయా అభ్యర్థులకు కలుపుతారు. అలా దిగువ నుంచి ఎగువకు ఎలిమినేషన్‌ ప్రక్రియను నిర్వహిస్తూ కోటా ఓట్లు ఎవరికైనా వచ్చే దాకా కౌంటింగ్‌ కొనసాగిస్తారు. ఈ క్రమంలో కోటా (చెల్లిన ఓట్లలో 50 శాతం ప్లస్‌ ఒక ఓటు) ఓట్లు ఏ అభ్యర్థికైనా వచ్చినట్లయితే ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.

రెండో రౌండ్‌లోనూ ‘పల్లా’దే ఆధిక్యం

నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో రౌండ్‌ కౌంటింగ్‌ ముగిసే వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్‌ ముగిసే వరకు 7,871 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 15,857 ఓట్లు పోలవగా.. స్వతంత్ర అభ్యర్థి నవీన్‌కుమార్‌కు 12,070 ఓట్లు, ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు 9,448, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 6,669, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 3,244, రాణిరుద్రమకు 1,634, చెరుకు సుధాకర్‌కు 1,330, జయసారధికి 1,263 ఓట్లు పోలయ్యాయి. మరో 3,009 ఓట్లు చెల్లకుండా పోయాయి.