‘పల్లా’కు మద్దతుగా మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ప్రచారం

వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మద్దతుగా మంగళవారం మహబూబాబాద్‌ పట్టణంలోని 11, 35 వార్డుల్లో ఎమ్మెల్యే భానోత్‌ శంకర్‌ నాయక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పాల్వాయి రామ్మోహన్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ పట్టభద్రులను కలుస్తూ ఓట్లు అభ్యర్థించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజేశ్వర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటు నుంచి అన్ని వర్గాల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్ చైర్మన్ ఫరీద్, పర్కాల శ్రీనివాస్ రెడ్డి, గద్దె రవి, యాళ్ల మురళీధర్ రెడ్డి, బాలు నాయక్, దాసరి రావిష్ తదితరులు పాల్గొన్నారు.