పామాయిల్ సాగుకు ప్ర‌భుత్వం ప్రోత్సాహం : వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి

హైద‌రాబాద్ : శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా పామాయిల్ సాగుపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. ప్ర‌స్తుతం రాష్ర్టంలో పామాయిల్ సాగు విస్తీర్ణం 48,806 ఎక‌రాల్లో ఉంద‌న్నారు. రాష్ర్టంలోని 25 జిల్లాల్లో 8 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పామాయిల్ సాగుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. ఇప్ప‌టికే పామాయిల్ సాగుపై రైతుల‌కు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు. పామాయిల్ సాగును ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు.

భార‌త‌దేశంలో వంట నూనెల ప్రాధాన్య‌త పెరిగింది. ప్ర‌స్తుతం 21 మిలియ‌న్ ట‌న్నుల‌ వంట నూనెను దేశంలో స‌గ‌టున వాడుతున్నారు. అందులో 10 మిలియ‌న్ ట‌న్నుల‌ పామాయిల్‌ను విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకుంటున్నాం. ఇందుకు విదేవీ మార‌క‌ద్ర‌వ్యంలో రూ. 90 వేల కోట్లు చెల్లిస్తున్నామ‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో పామాయిల్ సాగును ప్రోత్స‌హించేందుకు రాష్ర్ట ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. భ‌విష్య‌త్‌లో దేశ అవ‌స‌రాల‌ను తీర్చాలంటే సుమారు 70 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పామాయిల్ సాగును ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

రాష్ర్టంలో 8 ల‌క్ష‌ల 14 వేల 300 పైచిలుకు ఎక‌రాల్లో పామాయిల్ సాగును చేసేందుకు రాష్ర్ట ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు. వంట నూనెల సాగు విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతుంద‌న్నారు. రాష్ర్టంలో 25 జిల్లాల్లో ఈ సాగుకు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే ఆ జిల్లాల్లో అధికారులు ప‌ర్య‌టించి, పామాయిల్ సాగుకు భూముల‌ను ఎంపిక చేశార‌ని పేర్కొన్నారు. ఈ సాగు వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌వ‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.