మెడ్‌ట్రానిక్‌ కేంద్రం ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో మెడ్‌ట్రానిక్‌ వైద్య పరికరాల ఇంజినీరింగు కేంద్రాన్ని బుధవారం రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. మెడ్‌ట్రానిక్‌.. వైద్యపరికరాల తయారీలో ప్రసిద్ధి చెందిన అమెరికన్‌ సంస్థ. అది హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడా బీఎస్‌ఆర్‌ టెక్‌ పార్క్‌లో రూ.1,200 కోట్ల పెట్టుబడితో ప్రపంచ స్థాయి వైద్య పరికరాల ఇంజినీరింగు, ఆవిష్కరణల కేంద్రాన్ని నెలకొల్పింది. ఆరోగ్య సంరక్షణ రంగంలో  ఇంజినీరింగు పట్టభద్రులకు ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేస్తోంది.

అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా  ఏర్పాటైన మెడ్‌ట్రానిక్‌ 140 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే కేంద్రం ద్వారా ఆరంభంలో వేయి మందికి… ఆ తర్వాత మరో నాలుగువేల మందికి ఉపాధి లభిస్తుంది. అమెరికా తర్వాత ప్రపంచంలో ఏర్పాటు చేస్తున్న రెండో కేంద్రం ఇదే. 2016లో ఆ దేశంలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌ మెడ్‌ట్రానిక్‌ కార్యనిర్వాహక ఛైర్మన్‌ ఒమర్‌ ఇస్రాక్‌తో సమావేశమై పెట్టుబడుల గురించి చర్చించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగాయి. చివరికి సంస్థ నిర్ణయం తీసుకొని గత ఏడాది ఆగస్టులో మంత్రి కేటీఆర్‌ను కలిసి దానిని వెల్లడించింది. ఆ తర్వాత పనులు చేపట్టి నేడు దానిని ప్రారంభించారు.