నెటిజన్లకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశ్న

హైదరాబాద్‌ : గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్ ధ‌ర‌లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిరంత‌రం పెరుగుతున్న ధ‌ర‌ల‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. అయినా ఇవేవీ ప‌ట్ట‌‌న్న‌ట్టుగా కేంద్రం వ్య‌వ‌హరిస్తోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. కేంద్ర ప్ర‌భుత్వం అస‌మాన ప‌నితీరు వ‌ల్ల పెరిగిపోతున్న జీడీపీకి అస‌లు ఫుల్ ఫాం ఏంటి అని నెటిజ‌న్ల‌ను ప్ర‌శ్నిస్తూ ఓ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజ‌న్లు స్పందిస్తూ.. గ్యాస్, డీజిల్‌, పెట్రోల్ అని గుజ‌రాత్‌, డీజిల్ పెట్రోల్ అని పెద్ద ఎత్తున స‌మాధానాలిచ్చారు.

జీడీపీ(గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రొడ‌క్ట్‌‌) అనగా స్థూల జాతీయోత్పత్తి. ఒక దేశంలోని ఆర్థిక కార్యకలాపాల విలువను జీడీపీతో కొలుస్తారు. జీడీపీ వృద్ధి చెందుతుందంటే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని అర్థం. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి అనే మాట అటుంచితే తన చర్యలతో సామాన్యుల నడ్డి విరగ్గొడుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో రూ. 400 ఉండే గ్యాస్‌ రూ. 800, రూ. 60 రూపాయలు ఉన్న పెట్రోలు రూ.100, డీజిల్‌ ప్రస్తుతం రూ.89, గతంలో రూ. 80 ఉన్న మంచినూనె రూ. 150 అయింది.

గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ పెరుగుదల ప్రతీ నిత్యావసర వస్తువుపై పడుతుండటంతో పేద, మధ్య తరగతి బ్రతుకులు భారమౌతున్నాయి. అచ్ఛేదిన్‌ అని జనం చచ్చే దిన్‌ తెచ్చారని అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ హాయాంలో జీడీపీ పెంచుతామంటే దేశాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకువెళతారనుకున్నాం కానీ ఇలా గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలను పెంచుతూపోతారని అనుకోలేదని అంటున్నారు.