రూ.90 కోట్ల కట్నమిప్పిస్తాం..

దుండిగల్‌: వాలీబాల్‌ గ్రౌండ్‌ వద్ద ప్రియుడు, ప్రియురాలు ఇచ్చిన హై ఫై పోజులు మైనింగ్‌ వ్యాపారిని రూ. 11 కోట్లు ముంచాయి. వ్యాపారిని మోసం చేసే క్రమంలో రోజుకు లక్ష రూపాయలు వెచ్చించి స్టార్‌ హోటల్‌లో ప్రియుడు, ప్రియురాలు బస చేసినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని బాచుపల్లి పోలీసులు బుధవారం ఓ భారీ మోసాన్ని బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మైనింగ్‌ వ్యాపారి రూ. 11 కోట్లు ఎలా మోసపోయాడు.. ఒకటి రెండు కోట్లు ఇవ్వగానే అవతలి వాళ్ల నాడి పట్టేయవచ్చుకదా.. అంతగా బాధితుడికి మోసగాళ్ల వద్ద ఏమి నచ్చిందనే విషయాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యింది.. అయితే.. ఈ ఘటనలో ఒకే ప్రాంతం.. ఒకే సామాజిక వర్గం కావడంతో తనవారి నుంచి సామాజిక హోదా వస్తుందనే భావనలో బాధితుడు మోసగాళ్లు వేసిన ట్రాప్‌లో చిక్కుకున్నట్లు తెలుస్తున్నది.

రూ. 90కోట్ల కట్నం ఎర..

కడప జిల్లాకు చెందిన శిరీష అలియాస్‌ స్మృతి సింహా కు అదే జిల్లాకు చెందిన విజయ్‌కుమార్‌రెడ్డితో అయిన పరిచయం.. ప్రేమగా మారడం, ఆ తరువాత సహజీవనం చేశారు. సమాజంలో ధనవంతులుగా బతకాలని భావించిన శిరీష… అప్పటి వరకు నిర్వహించిన సూపర్‌మార్కెట్‌ను విక్రయించి బాచుపల్లిలోని ప్రణవ్‌ అంటీలియా విల్లాలో భార్య, భర్తలుగా చెప్పుకొని అద్దెకు దిగారు. శీరిష తన ఇద్దరు పిల్లలను.. తన అక్క పిల్లలుగా చెప్పుకుంది. విజయ్‌కుమార్‌రెడ్డి స్వతహాగా ఐపీఎస్‌ అని, తండ్రి డీసీపీ, స్మృతి సింహా జాతీయ మానవహక్కుల సంఘం దక్షణాది చైర్మన్‌గా బిల్డప్‌ ఇస్తూ పక్క విల్లాలో నివాసముండే మైనింగ్‌ వ్యాపారి వీరారెడ్డితో పరిచయం పెంచుకున్నారు.

వీరారెడ్డిది కూడా కడప జిల్లా కావడం, ఒకే సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో వీళ్లు త్వరగా దగ్గర అయ్యారు. అయితే.. వాలీబాల్‌ గ్రౌండ్‌ వద్ద విజయ్‌కుమార్‌రెడ్డి, స్మృతి సింహా బిల్డప్‌లు ఇచ్చేవారు. వీరి బిల్డప్‌లను చూసిన వీరారెడ్డి, తనకు కూడా సమాజంలో మరింత గుర్తింపు రావాలంటే ఇలాంటి పెద్ద వాళ్లతో స్నేహం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తరువాత అందరూ కలిసి తిరగడం ప్రారంభించారు. ఇలా.. ట్రాప్‌లో పడ్డ వ్యాపారి వీరారెడ్డికి తమకు 72 వోల్వో బస్సులు, బాచుపల్లిలో 35 ఎకరాల స్థలం ఉందంటూ విజయ్‌కుమార్‌రెడ్డి నమ్మించాడు. ఆ తరువాత వీరారెడ్డి కూడా వీళ్లు అడిగినంత డబ్బులు ఇవ్వడం చేశాడు. ఇలా.. సంవత్సరం కాలంగా వీరారెడ్డి డబ్బులు ఇస్తూనే వెళ్లాడు.

వ్యాపారం చేద్దామంటూ..

శంషాబాద్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో 40 రోజుల పాటు బస చేసిన సింహా, విజయ్‌లు రోజుకు రూ.లక్ష  చెల్లించారు. చివరకు డబ్బులు సరిపోకపోవడంతో  తమ ఖరీదైన కారును రూ. 50 లక్షలకే తక్కువ ధరకు విక్రయించారు.  కడపలో 50 ఎకరాల పొలం ఉందని, తమకు ఎకరా రూ.80 లక్షలకే వస్తోందంటూ నమ్మించి.. వ్యాపా రం చేద్దామంటూ వీరారెడ్డి వద్ద రూ.3 కోట్లు తీసుకున్నారు. ఇదిలాఉండగా.. వీరారెడ్డి బావమరిదికి పెండ్లి సంబంధాల కోసం విజయకుమార్‌రెడ్డి మాట్లాడాడు. తమ బంధువు ఉందని నమ్మించారు. ఆమె పేరు ప్రవళిక అని బెంగళూర్‌లో ఉందని, ఆమె తనకు కజిన్‌ అంటూ విజయ్‌ నమ్మించాడు. రూ. 80 కోట్ల నుంచి రూ. 90 కోట్ల కట్నం ఇప్పిస్తామంటూ హామీ ఇచ్చాడు. బెంగళూర్‌లో ఉన్న అమ్మాయితో మాట్లాడంటూ వాయిస్‌ మార్చే యాప్‌లను ఉపయోగించి స్మృతి తో మాట్లాడించేవారు. ఇలా భారీ కట్నం వస్తుందనే భా వన కూడా వీరారెడ్డిలో ఉండటంతో, మోసగాళ్ల గురించి వెంటనే తేరుకోలేకపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇలా ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవితం గడుపుతూ సుమారు రెండు సంవత్సరాల పాటు కాలం వెల్లదీశారు.

ఆత్మహత్యపై అనుమానాలు..!

బాధితుడైన వీరారెడ్డి డబ్బులిస్తున్న విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేదు. కొన్నాళ్లు ఈ విషయం ఎవరికైనా చెబితే తమ మధ్యలోకి వాళ్లు కూడా వచ్చే ప్రమాదముందనే భ్రమలో ఉన్నాడు. అనుకోకుండా ఒక రోజు వీరారెడ్డికి తెలిసిన వాళ్లు విజయ్‌కుమార్‌రెడ్డిని చూశారు. అతడు ఐపీఎస్‌ అంటే అనుమానించారు. అప్పటి వరకు మనస్సులో ఎదో ఒక రకమైన అనుమానం ఉన్న వీరారెడ్డికి, తన స్నేహితుడు చెప్పిన మాటతో మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. విజయ్‌కుమార్‌రెడ్డి, స్మృతి సింహాల గురించి ఆరా తీయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే విజయ్‌కుమార్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. విజయ్‌కుమార్‌రెడ్డి ఆత్మహత్యపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత మోసం చేసిన విజయ్‌కుమార్‌రెడ్డి ఆత్మహత్య చేసుకునేంత బలహీనమైన మనస్సు కల్గి ఉన్నాడా? తమకు మట్టి అంటకుండా వాళ్ల కుటుంబ సభ్యులే ఏమైనా చేసి ఉంటారా? అనే అను అనుమానాలు సైతం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్‌కుమార్‌రెడ్డి ఆత్మహత్యపై కూడా బాచుపల్లి పోలీసులు లోతైన దర్యాప్తు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.