హైదరాబాద్ : మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉదయం 11 గంటలకు తప్పనిసరిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని కేంద్ర హోంశాఖ రాష్ర్టాలను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. హైదరాబాద్ ముసారాంబాగ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద, సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద పోలీసులు, వాహనదారులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమరులకు నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల సేవలకు గుర్తుగా ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.