ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది

హైదరాబాద్‌ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతిమ ఘట్టం ముగిసింది. ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు తెరపడింది.  ఆదివారం పోలింగ్ నేపథ్యంలో 48 గంటల ముందు ఎన్నిక‌ల సంఘం నియమావ‌ళికి అనుగుణంగా అభ్యర్థులు ప్రచారం ముగించారు. ఫిబ్రవరి 16న ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో నెల రోజులుగా ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనాలు, సదస్సులు, సమావేశాలు నిర్వహించి ఓటర్లకు దగ్గరయ్యేందుకు అన్నివిధాలా కృషిచేశారు.

నల్లగొండ-ఖమ్మం- వరంగల్‌, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌  పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు  ఈ నెల 14న పోలింగ్‌ జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.  పోలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నిక‌లు బ్యాలెట్ ప‌ద్ధతిలో కొన‌సాగనుండటంతో బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేస్తున్నారు. పోలింగ్ ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.