జమిలీ ఎన్నికలపై మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలీ ఎన్నికలు వస్తే దేశం రెండుగా విడిపోవడం ఖాయమని, ఆ తర్వాత దేశ విభజన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని ఆయన జోస్యం చెప్పారు. రేవంత్ సంచలన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.హైదరాబాద్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధ్యక్షడు కావడానికి దక్షిణ భారత్ ఓట్లు అవసరం లేదన్నారు. అధ్యక్షుడికి నేరుగా ఎన్నికలు జరిగితే .. దక్షిణ భారత ప్రజలు సున్నాగా మారుతారన్నారు. దేశ విభజన జరిగితే దక్షిణాది దేశం అత్యంత ధనిక దేశం అవుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజల అవసరం లేకుండా అధ్యక్షుడి ఎన్నిక జరిగినప్పుడు.. ఇక్కడి ప్రజలు ఎందుకు ఊరుకుంటారని రేవంత్ ప్రశ్నించారు. మోదీ ప్రధాని అయ్యాక దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిందన్నారు. ప్రాధా న్యం కలిగిన కేంద్ర మంత్రి పదవులను ఉత్తరాది వారికే కట్టబెడుతున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.పన్నులు కడుతున్నది మాత్రం దక్షిణ భారత్ రాష్ట్రాల వారేనని, కానీ నిధులు ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతున్నాయన్నారు. దక్షిణాది రాష్ట్రాల వివక్షకు కారణమయ్యే జమిలీ ఎన్నికల ఆలోచనను మోదీ విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు ఉద్యమాన్ని అణచి వేసేందుకు జాతీయ రహదారులను కిలోమీటర్ల మేర తవ్వడం దుర్మార్గమన్నారు. రాజ్యాంగాన్ని సవరిస్తున్నప్పుడు.. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు.గత కొంత కాలంగా ప్రధాని మోడీ జమిలీ జపం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్ల సదస్సులో కూడా మోడీ జమిలీ ఎన్నికల గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు. పదేపదే మోడీ జమిలీ అంటుండడంతో అలాంటి ఏర్పాట్లు ఏవో జరుగుతున్నాయనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా జమిలీ ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. ఇక చంద్రబాబైతే ఎప్పుడెప్పుడు జమిలీ ఎన్నికలు వస్తాయా? జగన్ దిగిపోయి, తాను అధికారంలోకి ఎప్పుడొస్తానా? అని కలలు కంటున్నారు. నిప్పు లేనిదే పొగరాదనే చందంగా … జమిలీపై మాత్రం కేంద్రం ఏదో చేస్తోందనే అనుమానాలకు, ప్రతిపక్ష పార్టీల విమర్శలు బలం చేకూరుస్తున్నాయి.
