సాహసం చేసి… సారును చూద్దామని వచ్చా..

భిమానం ఎంతటి సాహసానికైనా పురికొల్పుతుందనడానికి ఉదాహరణ ఈ చిత్రం. 30 అడుగుల ఎత్తున్న కట్టపై నుంచి సన్నని పైపు సాయంతో జరజరా జారుతున్న ఈ మహిళ పేరు మంగమ్మ. ఊరు వర్గల్‌ మండలం రామక్కపేట. అప్పటివరకు పొలంలో పనిచేసుకుంటున్న ఆమెకు సీఎం మరికాసేపట్లో హల్దీవాగులోకి గోదావరి జలాలు విడుదల చేసేందుకు వస్తారని తెలిసింది. అంతే…అవతలి కట్ట మీద నుంచి సన్నని పైపు సాయంతో కాలవలోకి దిగింది. అక్కడి నుంచి చదునుగా ఉన్న మార్గం మీదుగా వేదికవైపు పరుగులు తీసింది. ఆమెతో మాట కలపగా.. ‘రెండెకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న, కూరగాయలు సాగు చేస్తున్నాం. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోర్ల నుంచి కొద్దికొద్దిగా నీళ్లు వస్తున్నాయి. పంటలూ సరిగా పండే పరిస్థితి లేదు. ఇప్పుడు కాలువలోకి నీళ్లు వస్తున్నాయంటే సంతోషంగా ఉంది. నాకు ఇద్దరు అబ్బాయిలు. బాగానే చదివించా. ప్రస్తుతం ప్రైవేటుగా చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. నీళ్లిచ్చినట్లే పిల్లలకు కూడా మేలు జరిగేట్లు ఏదైనా చేస్తే బాగుంటుంది’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. జారిపడతాననే భయం లేకుండా అంత ఎత్తు నుంచి ఎలా దిగావని అడగ్గా.. సారంటే అభిమానం. చూద్దామని వచ్చా..మొత్తానికి చూడగలిగానని చెప్పింది.

Source from : eenadu.net