మ‌హాత్మాగాంధీ సింహంలా గర్జించారు:సీఎం కేసీఆర్

హైద‌రా‌బాద్ : స్వాతంత్ర్య భారత్‌ 75వ వసం‌తం‌లోకి అడు‌గు‌పె‌డు‌తున్న సంద‌ర్భంగా.. శుక్ర‌వారం నుంచి దేశ‌వ్యా‌ప్తంగా ఆజాదీ‌ కా అమృత్‌ మహో‌త్సవ్‌ వేడు‌కలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ ఉత్స‌వా‌లను తెలం‌గా‌ణ రాష్ర్ట ప్ర‌భుత్వం ప‌బ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా నిర్వ‌హించింది. ఈ వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. ఈ వేడుక‌ల‌కు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. 75 వారా‌ల‌పాటు ఈ ఉత్స‌వాలు కొన‌సాగ‌నున్నాయి. గవ‌ర్నర్‌ తమి‌ళిసై సౌంద‌ర్‌‌రా‌జన్‌ వరం‌గ‌ల్‌లో జాతీయ జెండాను ఆవి‌ష్క‌రించి ఉత్స‌వా‌లను ప్రారం‌భించారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌సంగించారు. దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 75 ఏండ్లు అవుతున్న నేప‌థ్యంలో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు సీఎం పేర్కొన్నారు. గాంధీ వ‌చ్చిన త‌ర్వాత స్వాతంత్ర్య ఉద్య‌మం ఉధృతంగా సాగింద‌న్నారు. మ‌న స్వాతంత్ర్య పోరాటం ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు. మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వారికి గాంధీ ఆద‌ర్శంగా నిలిచారు అని గుర్తు చేశారు. బ్రిటీష్ వారు తెచ్చిన ఉప్పు చ‌ట్టం దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌మాద‌క‌రంగా మారింద‌ని గాంధీ గ్ర‌హించారు. దీంతో గాంధీ 1930, మార్చి 12న ఉప్పు స‌త్యాగ్ర‌హాన్ని ప్రారంభించారు. ఉప్పు చ‌ట్టానికి వ్య‌తిరేకంగా దండి వ‌ర‌కు గాంధీ పాద‌యాత్ర చేశారు. ఉప్పు చ‌ట్టాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని గాంధీ డిమాండ్ చేశారు. దండి యాత్ర‌లో ప్ర‌జ‌లు వేలాదిగా పాల్గొన్నారు. అరేబియా స‌ముద్రం తీరాను పిడికెడు ఉప్పు చేత‌బ‌ట్టి.. మ‌హాత్మాగాంధీ సింహంలా గ‌ర్జించారు. గాంధీ చేప‌ట్టిన దండి యాత్ర‌లో హైద‌రాబాద్ ముద్దుబిడ్డ స‌రోజినీ నాయుడు పాల్గొన్నార‌ని గుర్తు చేశారు. దండి యాత్ర స్వాతంత్ర్య సంగ్రామంలో అద్భుత ఘ‌ట్ట‌మ‌ని సీఎం అన్నారు. స్వాతంత్ర్య ఉద్య‌మ చ‌రిత్ర‌ను నేటి త‌రానికి తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అహింసా ప‌ద్ధ‌తిలో శాంతియుతంగా గాంధీ ఉప్పు స‌త్యాగ్రహం చేప‌ట్టారు. ఆ ప‌ద్ధ‌తిలోనే శాంతియుతంగా తెలంగాణ రాష్ర్టం సాధించుకున్నామ‌ని సీఎం గుర్తు చేశారు.

రూ. 25 కోట్లు కేటాయింపు

రాష్ర్టంలో 75 వారాల పాటు అమృత్ మ‌హోత్స‌వ్ వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని సీఎం తెలిపారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా కొన‌సాగుతున్న ర‌మ‌ణాచారి ఈ క‌మిటీ అధ్య‌క్షులుగా నియ‌మించుకుని ముందుకు కొన‌సాగుతున్నామ‌ని తెలిపారు. ఈ వేడుక‌ల కోసం రూ. 25 కోట్లు కేటాయించామ‌ని చెప్పారు. న‌వీన త‌రం వారికి స్వాతంత్ర్య పోరాటాన్ని తెలియ‌జేసేందుకు ర‌మ‌ణాచారి ఆధ్వ‌ర్యంలో కార్య‌క్ర‌మాల‌కు రూప‌క‌ల్ప‌న జ‌రుగుతుంద‌న్నారు. అన్ని విద్యాసంస్థ‌ల్లో వ‌కృత్వ‌, వ్యాస‌ర‌చ‌న పోటీలు నిర్వ‌హిస్తార‌ని పేర్కొన్నారు. ర‌చ‌యిత‌లు, కవుల‌తో క‌వి స‌మ్మేళ‌నాలు నిర్వ‌హించ‌డంతో పాటు సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించేలా కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌న్నారు.

గ‌వ‌ర్న‌ర్‌కు ధ‌న్య‌వాదాలు

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ వేడుక‌ల‌ను వ‌రంగ‌ల్‌లో ప్రారంభించిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్‌కు సీఎం కేసీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ ఉత్స‌వ వేడుక‌ల్లో ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌భుత్వ అధికారులతో పాటు ప్ర‌తి ఒక్క‌రూ పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మాల వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.