హైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్మరించుకున్నారు. ప్రార్థన, అభ్యర్థన, నిరసన అనే ఆయుధాలతో ప్రపంచానికి సరికొత్త పోరాట మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శప్రాయుడని సీఎం కేసీఆర్ అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. మహాత్మా గాంధీ అహింస, సత్యాగ్రహ దీక్షల ద్వారా స్వాతంత్ర్య సంగ్రామాన్ని ఉరకలెత్తించారని కీర్తించారు. దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్మాగాంధీ వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని కేసీఆర్ తెలిపారు. ఎప్పటికైనా సత్యానిదే అంతిమ విజయమని గాంధీ జీవితం చాటి చెప్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.