సంక్షేమ ప‌థ‌కాల‌కు నిధులు ఆప‌లేదు : సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ : ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాలతో ప‌ల్లెలు, పట్ట‌ణాల రూపురేఖ‌లు మారాయి అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గవ‌ర్నర్ చేసిన‌‌ ప్రసం‌గా‌నికి ధన్య‌వా‌దాలు తెలిపే తీర్మా‌నంపై చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. క‌రోనా ఉన్న కూడా ప‌ల్లెల‌కు నెల‌కు రూ. 308 కోట్లు, మున్సిపాలిటీల‌కు రూ. 148 కోట్లు విడుద‌ల చేశామ‌ని చెప్పారు. ఉద్యోగులకు సగం జీతాలు ఇచ్చాం కానీ సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాల‌కు ఎక్క‌డా నిధులు ఆప‌లేదు. ప్ర‌తి గ్రామంలో న‌ర్సరీలు ఏర్పాటు చేశాం. ప‌ల్లెలు ప‌చ్చ‌ద‌నంతో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. తెలంగాణ‌లోని ప్ర‌తి గ్రామ‌పంచాయ‌తీకి ట్రాలీ ట్యాంక‌ర్‌, ట్రాక్ట‌ర్ల‌ను స‌మ‌కూర్చామ‌ని తెలిపారు. 12 వేల ట్రాక్ట‌ర్లు అందుబాటులో ఉన్నాయి. శ‌వాన్ని గౌర‌వ‌ప్ర‌దంగా పంపేందుకు స్మ‌శాన వాటిక‌లు నిర్మిస్తున్నామ‌ని గుర్తు చేశారు.90 శాతం వైకుంఠ‌ధామాలు పూర్త‌య్యాయి. గ‌తంలో ఈ కార్య‌క్ర‌మాలు లేవు. ఇప్పుడు జ‌రుగుతున్నాయి అని చెప్పారు. సెంట్ర‌ల్ ఫైనాన్స్‌కు స‌మానంగా.. గ్రామాల‌కు, ప‌ట్ట‌ణాల‌కు నిధులు విడుద‌ల చేస్తున్నామ‌ని తెలిపారు. కూలిపోయిన కుల‌వృత్తుల‌ను ఆదుకుంటున్నామ‌ని చెప్పారు. గీత కార్మికుల నోట్లో మ‌ట్టి కొట్టారు. ఇండియాలో తెలంగాణ‌లో అత్య‌ధికంగా గొర్రెల పెంప‌కం ఉంద‌ని కేంద్ర‌మే పార్ల‌మెంట్ సాక్షిగా చెప్పింద‌ని గుర్తు చేశారు. యాద‌వ కుల‌వృత్తిని దేశ వ్యాప్తంగా నిల‌బెట్టామ‌ని చెప్పారు. హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం ద్వారా అడ‌వుల శాతం పెరిగింద‌ని కేంద్ర‌మే చెప్పింద‌న్నారు. కాంగ్రెసోళ్లు చెట్లు న‌రికితే.. తాము నాటి అట‌వీ సంప‌ద‌ను పెంచుతున్నామ‌ని కేసీఆర్ పేర్కొన్నారు.