చిరంజీవి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్టం మ‌రో ఉద్య‌మ వీరుడిని కోల్పోయింది. తెలంగాణ తొలి, మ‌లి ద‌శ ఉద్య‌మాల్లో కీల‌క పాత్ర పోషించిన డాక్ట‌ర్ చిరంజీవి కొల్లూరి(74) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గ‌చ్చిబౌలి ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ సోమ‌వారం తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు. చిరంజీవి మృతిప‌ట్ల ప‌లువురు నాయ‌కులు సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు. ఆయ‌న కుటుంబం ఆస్ప‌త్రి ఖ‌ర్చులు భ‌రించ‌లేని స్థితిలో ఉంద‌ని తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. సీఎంఆర్ఎఫ్ నిధి నుంచి రూ. 10 ల‌క్ష‌లు మంజూరు చేయించారు. రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్వ‌యంగా హాస్పిట‌ల్‌కు వెళ్లి.. ప్ర‌భుత్వ స‌హాయాన్ని అంద‌జేశారు.

సమాజం కోసం బతికిన చిరంజీవి జీవితం ఆదర్శనీ‌యం:సీఎం కేసీఆర్

తెలంగాణ తొలి తరం ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి మృతి పట్ల సీఎం శ్రీ కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్‌గా ఉన్నత చదువులు చదివి సమాజం కోసం బతికిన చిరంజీవి జీవితం ఆదర్శనీయమన్నారు. ఆయ‌న‌ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చిరంజీవి మృతి తీర‌ని లోటు : మ‌ంత్రి హ‌రీష్ రావు 

డాక్ట‌ర్ కొల్లూరి చిరంజీవి మృతి తెలంగాణ‌కు తీర‌ని లోటు అని ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు అన్నారు. కాక‌తీయ మెడిక‌ల్ కాలేజీ విద్యార్థిగా ఉన్న స‌మ‌యంలో,విద్యార్థులంద‌రినీ కూడ‌గ‌ట్టి  1969 ఉద్య‌మంలో చిరంజీవి కీల‌క‌పాత్ర పోషించార‌ని మంత్రి పేర్కొన్నారు.