ట్రెండింగ్‌లో చీటర్‌ అరవింద్‌ హ్యాష్‌ట్యాగ్‌

హైదరాబాద్‌: ‘తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ లేదు. నిజామాబాద్‌లో  సుగంధద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశాం’ అంటూ కేంద్ర వ్యవసాయశాఖ  మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ రాజ్యసభలో లిఖిత పూర్వకంగా చేసిన ప్రకటనపై పసుపు రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.  ఏడాదిన్నరగా రైతులతో బీజేపీ దాగుడుమూతలు ఆడుతూ తీరా బోర్డు పెట్టే ఆలోచనే లేదని స్పష్టం చేయడంపై రైతులు ఆగ్రహం  వ్యక్తం చేస్తున్నారు.

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని ఎంపీ అరవింద్‌ రైతులకు బాండ్‌ పేపర్‌ రాసిచ్చారు. బోర్డు ఆలోచనే లేదంటూ కేంద్రమే స్పష్టం చేసిన నేపథ్యంలో అరవింద్‌ తన ఎంపీ పదవికి తక్షణమే రాజీనామా చేయాలంటూ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఎంపీకి వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో   మీమ్స్‌,  ట్వీట్ల వర్షం కురుస్తోంది.

రైతులను మోసం చేసిన ఎంపీ అరవింద్‌  చీటర్‌(మోసగాడు) అంటూ వేలాది మంది ట్వీట్లు చేస్తున్నారు. ఐదు రోజుల్లో బోర్డు తెస్తానంటూ డైలాగులు చెప్పిన  ఫేక్‌ డిగ్రీ ఎంపీ, రాజస్థాన్‌ కా రాజా ఎక్కడ? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.    #CheaterArvind, #BJPCheatsTelangana, #ResignFakeMP, #BJPFailsTurmericBoard,  #ArvindMustResign  హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.

అరవింద్‌ బాండ్‌ పేపర్‌ సారాంశం ఇదిగో…

నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధి ప్రాంత రైతన్నలకు… నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధి ప్రాంత రైతన్నలకు సవినయంగా నమస్కరించి తెలియజేస్తున్నాను… అర్వింద్‌ ధర్మపురి అను నేను, బీజేపీ, నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత, పసుపు బోర్డును గానీ, పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధరను కానీ  తీసుకు రాలేని పక్షంలో, నా పదవికి రాజీనామా చేసి రైతు/ప్రజా ఉద్యమంలో పాల్గొంటానని మాటిస్తున్నాను.