గొలుసుకట్టు…గుట్టురట్టు

హైదరాబాద్‌ : గొలుసుకట్టు మార్కెటింగ్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.  24 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇండస్‌ వివా హెల్త్‌ సైన్సెస్‌ పేరుతో ఈ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రూ. 1500 కోట్ల మేర వసూలు చేసినట్లు గుర్తించారు. ఇండస్‌ వివా సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాల్లోని రూ. 20 కోట్ల నగదును సీజ్‌ చేశారు. ఇండస్‌ వివా సంస్థ కేసులో థామస్‌ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా ఉన్నాడని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు.ఈ కేసులో అరెస్టయిన వారిలో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం ఉన్నారని, వీరు సెలవులు పెట్టి మరీ సంస్థ కోసం పనిచేశారని వెల్లడించారు. కొత్తవారిని చేర్చితే ఆదాయం వస్తుందని చెప్పి మోసాలకు పాల్పడ్డారు. కొత్త వారిని వినియోగదారులుగా చేర్పిస్తే చేర్పించిన వారికి కొంత కమీషన్‌ ఇచ్చి తొలుత ఆకట్టుకుంటారు. గొలుసుకట్టు విధానం అంటేనే మోసం దాగిన వ్యాపారం అని సీపీ పేర్కొన్నారు. ఇండస్‌ వివా ఉత్పత్తుల విక్రయానికి ఎక్కడా అనుమతులు లేవని ఆయన చెప్పారు.