కేటీఆర్ చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకాలు చేస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు,ప్ర‌జ‌లు

విశాఖ‌ప‌ట్ట‌ణం : విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి జరుగుతున్న పోరాటానికి మద్దతు ప్ర‌క‌టించిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఆంధ్రా ప్ర‌జ‌లు జై కొడుతున్నారు. కేటీఆర్ చిత్ర‌ప‌టాల‌కు స్టీల్ ప్లాంట్ కార్మికుల‌తో పాటు అక్కడి ప్ర‌జ‌లు పాలాభిషేకాలు చేస్తున్నారు. తెలుగు రాష్ర్టాల ప్ర‌జ‌లంద‌రం క‌లిసి పోరాడి విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకుంటామ‌ని కార్మికులు స్ప‌ష్టం చేశారు. తెలుగు వారి ఐక్య‌త వ‌ర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

విశాఖ ఉక్కు పోరుకు మద్దతు

ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి కేటీఆర్ నిన్న ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. పోరాడి సాధించుకొన్న విశాఖ ఉక్కును వందశాతం అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి జరుగుతున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు. అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతితో విశాఖకు వెళ్లి ప్రత్యక్షంగా వారి పోరాటానికి మద్దతిస్తామని అన్నారు. ‘ఎక్కడో విశాఖలో జరిగే ఉద్యమాన్ని మనకెందుకులే అనుకుంటే రేపు మన దగ్గరకూ వస్తారు. విశాఖ ఉక్కును అమ్ముతున్నట్టుగానే రేపు బీహెచ్‌ఈఎల్‌, ఎల్లుండి సింగరేణిని అమ్ముతారు’ అని హెచ్చరించారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రైవేట్‌పరం చేయాలంటారేమో అని ఎద్దేవాచేశారు. తెలంగాణలో పీఎస్‌యూలను అమ్మే ప్రయ త్నం జరిగితే ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రభుత్వ సంస్థలను ఇక్కడ కాపాడుకుంటుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నదని అన్నారు.

 

 

*source from ntnews*