తెలంగాణ మిలియ‌న్ మార్చ్‌కు ప‌దేండ్లు..

మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక ఘట్టంగా మిలియన్ మార్చ్. నాడు హైద‌రాబాద్ న‌డిబొడ్డున నిర్వ‌హించిన మిలియ‌న్ మార్చ్ విజ‌య‌వంత‌మైంది. ఈ మార్చ్ తెలంగాణ ఉద్య‌మాన్ని ప‌తాక స్థాయికి తీసుకెళ్లింద‌ని చెప్పుకోవ‌చ్చు.   తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు 2011 మార్చి 10న ప్రత్యేక రాష్ట్రానికి మద్దతిచ్చిన అన్ని రాజకీయ పార్టీలు ట్యాంక్ బండ్ వేదికగా జరిగిన ఈ ఉద్యమంలో పాల్గొన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మిలియన్ మార్చ్‌లో కీలక పాత్ర పోషించారు. ఆనాటి ఉద్యమకారులు, మేధావులు, విద్యావంతులు, కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఇలా సబ్బండ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఆనాడు మిలియన్ మార్చ్‌కు తరలివచ్చి ప్ర‌త్యేక రాష్ర్ట ఏర్పాటు ఆవ‌శ్య‌క‌త‌ను చాటారు.

అయితే మిలియ‌న్ మార్చ్ నిర్వ‌హించి నేటికి స‌రిగ్గా ప‌దేండ్లు అవుతోంది. ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ట్వీట్ చేశారు. ఆనాడు తాను మిలియ‌న్ మార్చ్‌లో పాల్గొన్న వీడియోను త‌న ట్విట‌ర్ పేజీలో షేర్ చేశారు. మిలియ‌న్ మార్చ్‌లో పాల్గొన్న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు, వారి స్ఫూర్తికి సెల్యూట్ చేస్తున్నాన‌ని క‌విత ట్వీట్‌లో పేర్కొన్నారు. త‌మ మాతృభూమి కోసం అంద‌రూ క‌లిసిక‌ట్టుగా నిల‌బ‌డి, చ‌రిత్ర సృష్టించామ‌ని క‌విత తెలిపారు.