రాష్ట్రానికి  అమెజాన్ భారీ పెట్టుబడి:కేటీఆర్

• తెలంగాణ రాష్ట్రంలో 20 వేల 761 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్న అమెజాన్
• తన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా ఏషియా పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న అమెజాన్
• హైదరాబాదులో మూడు అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేయనున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్
• ప్రతీ అవైలబిలిటీ జోన్లో అనేక డాటా సెంటర్ల ఏర్పాటు
• 2022 సంవత్సర తొలి ఆరు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించనున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్
• అమెజాన్ బారీ పెట్టుబడిని స్వాగతించిన మంత్రి కేటీఆర్
• తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదే
• ఇంత భారీ పెట్టుబడి రావడం అంటే తెలంగాణ ప్రభుత్వ విధానాలకు ప్రాధాన్యత అర్థం అవుతుందన్న కేటీఆర్
• తెలంగాణ పారదర్శక మరియు వేగవంతమైన పరిపాలన విధానాల వల్లనే తెలంగాణకు భారీ పెట్టుబడులు వస్తున్నాయి
• అమెజాన్ వెబ్ సర్వీసెస్ ను తన దావోస్ పర్యటన లో కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన కేటీఆర్
• అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడి తర్వాత డేటా సెంటర్ల పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణీయ గమ్యస్థానం గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన మంత్రి

తెలంగాణ రాష్ట్రానికి అత్యంత భారీ పెట్టుబడి మరొకటి వచ్చి చేరింది. ప్రముఖ ఐటీ కంపెనీ అమెజాన్ తన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజియన్ ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నది. ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజియన్లో 3 అవైలబిలిటీ జోన్లు ఉంటాయని తెలిపింది. అమెజాన్ ఏర్పాటు చేయబోతున్న ఏషియా పసిఫిక్ హైదరాబాద్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజియన్ 2022 ప్రథమార్థంలో తన కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. అమెజాన్ ఏర్పాటు చేయబోతున్న అవైలబిలిటీ జోన్లలో పెద్ద ఎత్తున డాటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపిన కంపెనీ, ఇవన్నీ ఒకటే రీజియన్ లో ఉన్నప్పటికీ, అదే సమయంలో ప్రతీ డేటా సెంటర్ దేనికదే స్వతంత్రంగా పని చేస్తుందని, తద్వారా విద్యుత్ సరఫరా, వరదలు, వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు నుంచి రక్షణ ఉంటుందని ఈ సందర్భంగా తెలిపింది.

అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్లను సుమారు 20 వేల 761 కోట్ల రూపాయలు అంటే 2.77 బిలియన్ డాలర్లతో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతుంది. అమెజాన్ లాంటి అత్యంత ప్రఖ్యాత సంస్థ ఇంత భారీ ఎత్తున తెలంగాణలో డాటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో.. రానున్న రోజుల్లో తెలంగాణ డాటా సెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మారే అవకాశం ఉన్నది.

తెలంగాణలో ఏర్పాటవుతున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటి డేటా సెంటర్ల ద్వారా తెలంగాణ డిజిటల్ ఎకానమీ మరియు ఐటీ రంగం అనేక రెట్లు వృద్ధి సాధించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం అమెజాన్ ఏర్పాటు చేస్తున్న ఏషియా పసిఫిక్ రీజియన్ వెబ్ సర్వీసెస్ వలన వేలాది మంది డెవలపర్లకు, స్టార్ట్ అప్ లకి, ఇతర ఐటీ కంపెనీలకు మరియు విద్య మరియు ఇతర రంగాల్లో పనిచేస్తున్న ఎన్జీవోలు, అనేక ఇతర కంపెనీలకు తమ వెబ్ ఆధారిత సర్వీసులను నడుపుకునెందుకు వీలు కలుగుతుంది. భారీ ఎత్తున డేటా సెంటర్లు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఈ కామర్స్ ,పబ్లిక్ సెక్టార్, బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటి మరియు ఇతర అనేక రంగాల్లో తమ కార్యకలాపాల విస్తృతి పెరిగేందుకు అవకాశం కలుగుతుంది.

అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా సుమారు 20 వేల 761 కోట్ల రూపాయలు పెట్టుబడిగా తెలంగాణ రాష్ట్రం లోకి రావడం పట్ల పరిశ్రమలు మరియు ఐటీశాఖ మంత్రి కే. తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడికి సంబంధించి ప్రాథమిక చర్చలను దావోస్ పర్యటన లో ప్రారంభించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. దావోస్ పర్యటన లో అమెజాన్ సంస్థ ఉన్నతస్థాయి ప్రతినిధులతో ఇందుకు సంబంధించి చేసిన చర్చలను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా రాష్ట్రానికి వస్తున్న ఈ పెట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలోకి వస్తున్న అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని మంత్రి కేటీఆర్ తెలియజేశారు. ఈ పెట్టుబడి తర్వాత అనేక కంపెనీలు తమ డాటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని, అలాంటి వారందరికీ తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అమెజాన్ లాంటి ప్రఖ్యాత కంపెనీ తన భారీ పెట్టుబడికి తెలంగాణను ఎంచుకోవడం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పారదర్శక మరియు వేగవంతమైన పరిపాలనకు నిదర్శనం అని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక ఆదర్శవంతమైన ప్రభుత్వ విధానాలు మరియు పాలసీల ద్వారా ఐటి మరియు ఐటీ ఆధారిత రంగం పెద్ద ఎత్తున వృద్ధి చెందుతూ వస్తుందన్నారు. అందులో భాగంగానే ఈ రోజు అమెజాన్ తన పెట్టుబడిని తెలంగాణలో పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ విధానాల ద్వారా ఐటీ రంగంలో అనేక కంపెనీలు రావడంతో పాటు ఇన్నోవేటివ్ స్టార్టప్లకు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కేంద్రం గా తెలంగాణ రాష్ట్రం మారిందన్నారు. ఈ పెట్టుబడి ద్వారా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి అమెజాన్ కి మధ్య ఉన్న బంధం మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెజాన్ తన అతిపెద్ద కార్యాలయానికి హైదరాబాద్ కేంద్రంగా ఎంచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.