ఐటీ కా జాన్ …కేటీఆర్

కేటీఆర్ మెహనత్ కా నిషాన్
బనేగా హైద్రాబాద్ కీ శాన్

వినదగునెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింప తగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిలో సుమతి.. నిజమే…ఎవ్వరు ఏది చెప్తే అది విని అందులో మంచి వుందా చెడు వుందా అని చూడకుంటా ఆగమైతే దానికి ఎవరు బాధ్యులు కారు. అట్లా లేనిపోంది చెప్పి ఆగం చేసేవాల్లు మోసం చేసేవాల్లు సోమాలియ నుంచి సొంత నేలమీది ప్రతిపక్షాల దాకా ఎంతో మంది వుంటరు. తొందరపడకుండా నిజానిజాలను గుర్తించగలగాలె. అట్లా, ఎవ్వలెన్నిఅబద్దాలు చెప్పినా వినకుండా తెలంగాణ ప్రజలు వాస్తవాలు గ్రహించిన్రు కావట్టే.. కెసిఆర్ వెంట నడిచి రాష్ట్రాన్ని సాధించుకుని అభివృద్ది పథంలో పయనిస్తున్నరు.

అదే మాదిరి, ఎవరెన్ని దుష్ర్పచారాలు చేసినా హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజీని ఎంతగా దెబ్బతీయాలని చూసినా ప్రపంచ వ్యాపారవేత్తలు నమ్మడం లేదు. వారికి హైద్రాబాద్ గొప్పతనం తెలుసుకావట్టే పెట్టుబడులు పెట్టడానికి ముందుకువస్తున్నరు. అట్లా వాస్తవాలను గ్రహించి హైద్రాబాద్ లో చారిత్రక పెట్టుబడి పట్టడానికి వస్తున్న గొప్ప సంస్థగా అమెజాన్ ను మనం అభినందించవచ్చు. ఎవ్వరూహించని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో.. 20 వేల 761 కోట్ల రూపాయలను తన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా ఏషియా పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు ప్రపంచ ఐటి దిగ్గజం అమెజాన్ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని తెలంగాణలో అమెజాన్ పెట్టబోతున్నది. ఇంత భారీ పెట్టుబడిని వొక కార్పోరేట్ సంస్థ పెట్టడం అంటే, తెలంగాణ ప్రభుత్వ విధానాలు అంతర్జాతీయ స్థాయిలో ఎంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నయో అర్థం అవుతున్నది. తెలంగాణలో సాగుతున్న పారదర్శకమైన, వేగవంతమైన పరిపాలన విధానాల వల్లనే ఇంత భారీ పెట్టుబడులు వస్తున్నయనేది సుష్పష్టమౌతున్నది.
హైదరాబాద్ లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజియన్ 2022 నాటికి తన కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. విద్యుత్ సరఫరా, వరదలు, వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు నుంచి రక్షణ ఉంటుందనే తాము హైద్రాబాద్ లో పెట్టుబడులు పెడుతున్నామని ఆ సంస్థ ప్రకటించింది. తద్వారా.. తెలంగాణలో ఏర్పాటవుతున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటి డేటా సెంటర్ల ద్వారా తెలంగాణ డిజిటల్ ఎకానమీతోపాటు ఐటీ రంగం అనేక రెట్లు వృద్ధి సాధించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం అమెజాన్ ఏర్పాటు చేస్తున్న ఏషియా పసిఫిక్ రీజియన్ వెబ్ సర్వీసెస్ వలన వేలాది మంది డెవలపర్లకు, స్టార్ట్ అప్ లకి, ఇతర ఐటీ కంపెనీలకు, విద్యా తదితర రంగాల్లో పనిచేస్తున్న ఎన్జీవోలు, అనేక ఇతర కంపెనీలకు తమ వెబ్ ఆధారిత సర్వీసులను నడుపుకునెందుకు వీలు కలుగుతుంది. ఈ కామర్స్ ,పబ్లిక్ సెక్టార్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటి ఇతర అనేక రంగాల్లో తమ కార్యకలాపాల విస్తృతి పెరిగేందుకు అవకాశం కలుగుతుంది.