సుశీల్ కుమార్ ఆర్మ్స్ లైసెన్స్ రద్దు

ఛత్రసాల్ స్టేడియం వద్ద యువ రెజ్లర్ సాగర్ ధనకర్ హత్య కేసులో అరెస్టయిన ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ ఆయుధ లైసెన్స్‌ను (ఆర్మ్స్ లైసెన్స్) రద్దు చేసినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. లైసెన్స్ రద్దు ప్రక్రియను లైసెన్స్ డిపార్ట్‌మెంట్ ప్రారంభించినట్టు తెలిపారు. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం సుశీల్ కుమార్‌ను హరిద్వార్ తీసుకెళ్లి.విచారిస్తున్నారు.సుశీల్ కుమార్ పరారీలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ తలదాచుకున్నారు, ఆయనకు ఎవరెవరు సహకరించారనే దానిపై దర్యాప్తు సాగిస్తున్నారు.

సుశీల్‌ కుమార్‌ 18 రోజుల పాటు పోలీసుల కళ్లుగప్పి తిరిగాడు. పరారీలో ఉన్న అతనికి ఆశ్రయం ఇచ్చిందెవరనే కూపీ లాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నేరం చేసిన సమయంలో అతను వేసుకున్న దుస్తులు, వాడిన సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇంకా స్వాధీనపరచలేదు. విచారణలో రెజ్లర్‌ సహకరించకపోవడంతో పోలీసులు మేజిస్ట్రేట్‌ ముందు వాదనల్ని వినిపించి అతని కస్టడీని ఇంకొన్ని రోజులు పొడిగించుకున్నారు. సుశీల్‌ దాడిలో సాగర్‌ చికిత్స పొందుతూ మరణించగా ఈ విషయం తెలుసుకున్న రెజ్లర్‌ ముందుగా హరిద్వార్‌కే పరారైనట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో అతన్ని అక్కడికి తీసుకెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.