కోహ్లి ఎంతో వినయంగా ఉంటాడు

ఫీల్డ్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని చూసిన వారంతా.. అతడికి చాలా కోపం అని.. ఎవరి మాట వినని వ్యక్తిగా అంచనా వేస్తుంటారు. ఫీల్డ్‌లో కోహ్లి బిహేవియర్‌ కూడా ఇలానే ఉంటుంది. దీని గురించి సోషల్‌ మీడియాలో నెటిజనులు రకరకాలుగా విమర్శలు చేస్తుంటారు. ఆఫ్‌ఫీల్డ్‌లో కూడా కోహ్లి ఇలానే ఉంటాడా.. ఇంత దూకుడుగా వ్యవహరిస్తాడా అంటే కాదు అంటారు అతడి గురించి బాగా తెలిసిన కొందరు ఆటగాళ్లు. ఫీల్డ్‌ బయట కోహ్లి ఎంతో ప్రశాంతంగా ఉంటాడట.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం తనది అంటారు. తాజాగా మాజీ టీమిండియా క్రికెటర్‌, సెలక్టర్‌ శరణ్‌‌దీప్ సింగ్ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి బయట ఎంతో వినయంగా ఉంటాడని తెలిపాడు.

ఈ సందర్భంగా శరణ్‌‌దీప్‌ మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు కోహ్లిని చూస్తే.. ఎంతో దూకుడుగా కనిపిస్తాడు. కానీ ఆఫ్‌ఫీల్డ్‌లో‌ కోహ్లి ఎంతో వినయంగా ఉంటాడు. తను మంచి శ్రోత. సెలక్షన్‌ మీటింగ్స్‌లో చాలా శ్రద్ధగా అందరూ చెప్పేది వింటాడు. గంటన్నర పాటు జరిగే ఈ సమావేశంలో కోహ్లి అందరూ చెప్పేది శ్రద్ధగా విని.. ఆ తర్వాత బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు’’ అన్నాడు

‘‘ఇక ఇంట్లో కోహ్లి ప్రవర్తనని చూసిన వారు అస్సలు నమ్మలేరు. అతడి ఇంట్లో పని వాళ్లు ఉండరు. కోహ్లి ఇంటికి భోజనానికి వెళ్తే అతడు, అతని భార్య దగ్గరుండి అతిథులకు భోజనం వడ్డిస్తారు. మనతో పాటే కూర్చుని మాట్లాడతాడు. మనతో కలిసి డిన్నర్‌కి బయటకు వస్తాడు. మిగతా ఆటగాళ్లు అందరూ కోహ్లిని ఎంతో గౌరవిస్తారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం కోహ్లిది’’ అని చెప్పుకొచ్చాడు.

“కెప్టెన్‌ అయినందున మైదానంలో అతను అలానే ఉండాలి. మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు మైదానంలో కోహ్లి ఎంతో ఒత్తిడిని ఎదుర్కుంటాడు.. చాలా సార్లు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దాంతో అతడు దూకుడుగా ఉన్నట్లు కనిపిస్తాడు” అన్నాడు. కోహ్లి అధ్వర్యంలో భారత జట్టు బుధవారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే డే-నైట్ టెస్టులో పాల్గొంటుంది.