ఐపీఎల్‌-14లో అడుగుపెట్టబోతున్న పుజారా

తాను ఐపీఎల్‌కు సిద్ధమని గత కొన్ని సీజన్ల నుంచి ప్రకటిస్తూ వస్తున్న చతేశ్వర్‌ పుజారా ఎట్టకేలకు మరొకసారి ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఆడబోతున్నాడు. ఈసారి ఐపీఎల్‌ వేలంలో పుజారాను 50 లక్షల రూపాయల కనీస ధరకు సీఎస్‌కే కొనుగోలు చేసింది. టెస్టు క్రికెటర్‌గా ముద్ర పడిన పుజారా.. చివరిసారి 2014లో కింగ్స్‌ పంజాబ్‌ తరఫున ఆడాడు. సుమారు ఏడేళ్ల తర్వాత పుజారా మరొకసారి ఐపీఎల్‌కు ఆడటం విశేషం.

కేవలం టెస్టు ప్లేయర్‌ ముద్ర కారణంగానే పుజారాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోగా, చివరకు సీఎస్‌కే ధైర్యం చేసి అతన్ని తీసుకుంది. పుజారా కోసం ఎవరూ పోటీ లేకపోవడంతో సీఎస్‌కే శిబిరంలో ఆనందం వ‍్యక్తమైంది. ఈసారి వేలంలో పుజారా పేరు రాగానే సీఎస్‌కే కనీస ధరకు బిడ్‌కు వెళ్లింది. కాగా, మిగతా ఫ్రాంచైజీలు ఏవీ కూడా అతన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరచకపోవడంతో కనీస ధరతోనే ఐపీఎల్‌-14లో అడుగుపెట్టబోతున్నాడు పుజారా.