పీయూష్‌ చావ్లా ఇంట తీవ్ర విషాదం

టీమిండియా వెటరన్‌ బౌలర్‌, ముంబై ఇండియన్స్‌ క్రికెటర్‌ పీయూష్‌ చావ్లా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి ప్రమోద్‌ కుమార్‌ చావ్లా కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన, సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని పీయూష్‌ చావ్లా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. తన తండ్రి ఫొటోను ఇందుకు జత చేసిన పీయూష్‌.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాల్సిందిగా కోరాడు. ‘‘ఆయన లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టం. పరిస్థితులు ఇంతకు ముందులా ఉండబోవు. నా అండను కోల్పోయాను’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.

కాగా టీ20 వరల్డ్‌ కప్‌-2007, వన్డే వరల్డ్‌ కప్‌-2011 టీమిండియాలో సభ్యుడైన పియూష్‌.. ఐపీఎల్‌లో తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, ఈ ఏడాది మినీ వేలంలో భాగంగా ముంబై ఇండియన్స్‌ 2.40 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ స్పిన్నర్‌ను సొంతం చేసుకుంది. కానీ, ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. ఇక కరోనా విజృంభణ నేపథ్యంలో ఐపీఎల్‌-2021 నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.