టీమిండియా ఆటతీరుపై నెటిజన్ల ట్రోల్స్‌

ఆసీస్‌తో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా ఘోర వైఫల్యంపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. 36 పరుగులకే ఇన్నింగ్స్‌ ముగించి టెస్టు చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకుంది. టీమిండియా ఆటతీరుపై నెటిజన్లు చేసిన ట్రోల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

‘ఇది నిజంగా సిగ్గు పడాల్సిన విషయం.. 36 పరుగులకే ఇన్నింగ్స్‌ ముగించి చెత్త రికార్డు నమోదు చేసింది. వెంటనే జట్టును స్వదేశానికి రప్పించాలని బీసీసీఐని కోరుతున్నా.. బీసీసీఐ వల్ల కాకపోతే భారత ప్రభుత్వం ద్వారా వారిని రప్పించండి… ‘సిగ్గు సిగ్గు.. టీమిండియా ఘోర వైఫల్యం నేను చూడలేను..’ ‘ఇవాళ టీమిండియా చెత్త ఆట బాధించింది. నా జీవితంలో 2020 లేకపోయుంటే బాగుండేది అనిపించింది… ఈ ఏడాది మాకు కలిసిరాలేదు.. టీమిండియా వైఫల్యం జీవితాంతం వెంటాడుతుంది.. 2020 ముగింపులో ఇదో విషాద వార్త అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే టీమిండియా ఘోర ఓటమి దిశగా పయనిస్తోంది. 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ విజయానికి ఇంకా 20 పరుగుల దూరంలో ఉంది. భారత బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆసీస్‌ ఓపెనర్లు మాథ్యూ వేడ్‌, జోస్‌ బర్న్స్‌లు ఇన్నింగ్స్‌ కొనసాగించారు. 70 పరుగుల వద్ద 33 పరుగులు చేసిన వేడ్‌ రనౌట్‌గా వెనుదిరగ్గా.. బర్న్స్‌ 40, లబుషేన్‌ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.