కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ వేయించుకున్న కోహ్లి

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ తొలి డోస్‌ను వేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన అతడు… ‘‘వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ వేయించుకోండి. సురక్షితంగా ఉండండి’’ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. కాగా మహమ్మారి కరోనా ఉధృతి నేపథ్యంలో ఐపీఎల్‌-2021 సీజన్‌ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటికి చేరుకున్న ఆర్సీబీ సారథి కోహ్లి.. భార్య అనుష్క శర్మతో కలిసి కోవిడ్‌పై పోరుకు రూ. 2 కోట్లు దానం చేయడంతో పాటుగా, తమ వంతుగా విరాళాలు సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. విరుష్క దంపతుల విజ్ఞప్తికి భారీ స్పందన వచ్చింది.

ఈ క్యాంపెయిన్‌ ప్రారంభించిన 24 గంటల్లోనే రూ. 3.6 కోట్ల రూపాయలు జమయ్యాయి. ఈ విషయాన్ని కోహ్లి స్వయంగా వెల్లడించాడు. అదే విధంగా కరోనాపై పోరాటంలో ముందుండి సేవలు అందిస్తున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను హీరోలుగా అభివర్ణించిన అతడు.. వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఇక వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించే క్రమంలో సోమవారం టీకా తొలి డోసు తీసుకున్నాడు. కాగా.. ఇప్పటికే టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోగా, ఇషాంత్‌ శర్మ సైతం నేడు టీకా తీసుకున్నట్లు వెల్లండించాడు.