ఓపెనింగ్‌పై స్పష్టత ఇచ్చిన కోహ్లీ

ఇంగ్లండ్‌తో సుదీర్ఘ ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఇప్పటికే టెస్టు సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న టీమిండియా.. ఐదు టీ20ల సిరీస్‌కు సన్నద్ధమైంది. రేపట్నుంచి(శుక్రవారం​)నుంచి ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. దీనిలో భాగంగా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో​ మాట్లాడిన కెప్టెన్‌ కోహ్లి.. ఓపెనింగ్‌పై స్పష్టత నిచ్చాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో రోహిత్‌ శర్మతో​ కలిసి కేఎల్‌ రాహుల్‌ ఓపెనింగ్‌కు దిగుతాడని పేర్కొన్నాడు. రోహిత్‌-రాహుల్‌లు నిలకడగా ఆడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. జట్టుకు మంచి భాగస్వామ్యాన్ని సాధించి ఇప్పటికే ఎన్నో విజయాలు అందించారు. దాంతో వీరిద్దరితోనే ఓపెనింగ్‌కు దిగుతాం.

ఈ ఇద్దరిలో ఎవరికైనా విశ్రాంతి ఇవ్వాల్సి వస్తే శిఖర్‌ ధావన్‌ మూడో ఓపెనర్‌గా ఉంటాడు. రోహిత్‌-రాహుల్‌లే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఓపెనర్లు. మేము ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఫ్రీగా ఆడాలనుకుంటున్నాం​. మా జట్టులో విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. ఈసారి మా బ్యాట్స్‌మెన్‌ మరింత స్వేచ్ఛగా ఆడతారు’ అని తెలిపాడు. ఇక రాహుల్‌ విషయానికొస్తే, గతేడాది డిసెంబర్‌ నుంచి చూస్తే భారత్‌ తరఫున మ్యాచ్‌లు ఆడలేదు. గత డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌ ఆడిన తర్వాత రాహుల్‌ ఏ విధమైన క్రికెట్‌ ఆడలేదు.

కాగా, ఈ ఏడాది భారత్‌లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ ఫేవరేట్‌ అని కోహ్లి అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం వరల్డ్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ టాప్‌ ప్లేస్‌లో ఉందన్న కోహ్లి.. ఆ జట్టును ఈ ఫార్మాట్‌లో ఓడించడం ఎవరికైనా కష్టమనేన్నాడు. ఇది ఎవరైనా అంగీకరించాల్సిందేనని కోహ్లి తెలిపాడు. స్వదేశంలో టీ20 వరల్డ్‌కప్‌ జరుగనున్న నేపథ్యంలో టీమిండియాను ఫేవరెట్‌గా పరిగణించవచ్చా అనే ప్రశ్నకు కోహ్లి ఇలా సమాధానమిచ్చాడు. ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌.. టీమిండియానే ఫేవరెట్‌ అని అభిప్రాయపడగా, కోహ్లి మాత్రం ఇంగ్లండ్‌ ఫేవరెట్‌ అని చెప్పడం గమనార్హం. ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో టీ20 వరల్డ్‌కప్‌ నిర్వహించడానికి ఐసీసీ సన్నద్ధమవుతోంది.